
రూ.5 లక్షలిస్తారా....అబ్బాయిని అమ్మేస్తా...
పుట్టి నెలైనా నిండని పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టింది.
- అమ్మకానికి యత్నించిన కన్నతల్లి
- తల్లితో పాటు మరో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: పుట్టి నెలైనా నిండని పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి.. తల్లిని అరెస్టు చేసి బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొడిచర్లకు చెందిన అంజమ్మ గతనెల 9న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎయిడ్స్ బాధితురాలు కావడంతో ప్రసవం తరువాత గాంధీ ఆసుపత్రిలో 10 రోజులు చికిత్స పొందింది. ఈ క్రమంలో భర్త దేవయ్యకు తెలియకుండా ఇద్దరు బంధువులతో కలసి బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకుంది. నగరంలోనే ఉంటూ ప్రతీరోజు రాత్రి బల్కంపేట సాయిబాబా దేవాలయం గుడి వద్దకు వచ్చి యాచకురాలి ముసుగులో బేరసారాలు సాగించేది. ఈ విషయం టీఆర్‌ఎస్ నాయకు రాలు లతకు తెలియడంతో శనివారం రాత్రి అంజ మ్మ వద్దకు వెళ్లి బాబును కొంటానని చెప్పింది. మహిళలను మాటల్లో పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
అక్కడకు సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు తమకూ బిడ్డ కావాలని అడిగారు. దీంతో అంజమ్మ రూ.5 లక్షలు ఎవరిస్తే.. బిడ్డను వారికే ఇస్తానంది. తమ వెంట వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి పోలీసులు అంజమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉన్న ఇద్దరు బిడ్డలనే పోషించలేని స్థితిలో ఉన్నామని అందుకే బిడ్డను అమ్మకానికి పెట్టినట్లు అంజమ్మ అంగీకరించింది. బాలుడు ఏడవకుండా ఉండేందుకు మత్తు పానియాలు ఇచ్చినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అంజమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.