
ఉప్పు.. నిప్పు..
ఎలా మొదలైందో.. ఎందుకు మొదలైందో తెలియదు.. ఒక్క పుకారు జనాన్ని ‘ఉప్పు’తిప్పలు పెట్టించింది!
- రాష్ట్రంలో ఉప్పు కొరత అంటూ పుకార్లు.. ఎగబడి కొన్న ప్రజలు
- పలుచోట్ల ‘నో స్టాక్’ అంటూ బోర్డులు
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్ : ఎలా మొదలైందో.. ఎందుకు మొదలైందో తెలియదు.. ఒక్క పుకారు జనాన్ని ‘ఉప్పు’తిప్పలు పెట్టించింది! టీవీల్లో ఉప్పు కొరత అంటూ వచ్చిన ఓ చిన్న స్క్రోలింగ్‌కు సోషల్ మీడియా ప్రచారం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఉప్పు కోసం ఎగబడ్డారు. జనం ఇంతగా దుకాణాలపై ఎందుకు దండెత్తుతున్నారో కొద్దికొద్దిగా అర్థం చేసుకున్న వ్యాపారులు అమాంతం ఉప్పు ధరలు పెంచేశారు. ఉన్న నిల్వలను దాచేసి కృత్రిమ కొరత సృష్టించారు. ఇంకేముంది? రాష్ట్రవ్యాప్తంగా సామాన్య జనం అవసరమైన దానికంటే ఎక్కువగా ఉప్పు ప్యాకెట్ల కోసం బారులు తీరారు. కొన్నిచోట్ల ఉప్పు బస్తాలు లాక్కెళ్లారు.
జహీరాబాద్‌లో ఓ మహిళ ఉప్పు ప్యాకెట్లు దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఉత్తరప్రదేశ్‌లో కిలో ఉప్పు రూ.250 ధర పలుకుతోందన్న ప్రచారంతో రాష్ట్రంలోని వ్యాపారులు అప్రమత్తమై ఉప్పు నిల్వలు దాచేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికితోడు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర సమస్య కూడా తోడైంది. తమ వద్ద చిల్లర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయడం, అదే సమయంలో రేట్లు పెంచి విక్రరుుంచడంతో ఉప్పు కొరత వార్త దావానలంలా వ్యాపించింది.
రూ.వెయ్యి పలికిన బస్తా?
వాస్తవానికి దొడ్డుప్పు (క్రిస్టల్ / తెల్లనిది) కిలో రూ.7 రూపాయలకు లభిస్తుంది. మెత్తటి ఉప్పు కిలో ప్యాకెట్ గరిష్టంగా రూ.15 ఉంది. 20 నుంచి 25 ప్యాకెట్లు ఉండే ఉప్పు బస్తా ధర సాధారణంగా రూ.300 దాటదని.. కానీ ఉప్పు కొరత ప్రచారం వల్ల ఏకంగా రూ.800 నుంచి రూ.వెయ్యి దాకా ధర పలికిందని చెబుతున్నారు. చిల్లర వ్యాపారుల వద్ద ఏకంగా కిలో ఉప్పు ప్యాకెట్ రూ.40, మరికొన్ని ప్రాంతాల్లో రూ.50 దాకా అమ్మారు. సంగారెడ్డి, జహీరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా వచ్చింది. హైదరాబాద్‌లో పాతబస్తీ, బోరబండ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లోని కిరాణా షాపుల వద్ద జనం ఉప్పు కోసం ఎగబడ్డారు. కుషారుుగూడలో కిలో ప్యాకెట్ రూ.100 అమ్మారు. బోరబండలో కిలో ప్యాకెట్ రూ.300కు విక్రరుుంచారని సమాచారం. వినియోగదారుల నుంచి స్థానిక పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు అందడంతో కుత్బుల్లాపూర్‌లో పోలీ సులు కిరాణా షాపులను తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మిన ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేయాలని నిర్ణరుుంచినట్లు సమాచారం.
పరుగులే పరుగులు..
ఉప్పుపై వచ్చిన పుకారుతో అన్ని జిల్లాల్లో జనం ఉరుకులు పరుగులు పెట్టారు. కిరాణ దుకాణాల ముందు బారులు తీరారు. హైదరాబాద్ వాసులు ఉదయాన్నే గల్లీలోని కిరాణా షాపుల ముందు వాలి పోయారు. ఇంట్లో మగవాళ్లు కొత్త నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరితే...ఆడవాళ్లు ఉప్పు కోసం కిరాణా దుకాణాల బాట పట్టారు. కొన్నిచోట్ల వ్యాపారులు బస్తాల కొద్ది ఉప్పును బేగంబజార్ నుంచి దిగుమతి చేసుకొని ఎక్కువ ధరకు విక్రరుుంచారు. రోజు అర క్వింటాల్ కూడా అమ్ముడవని ఉప్పు తమ వద్ద శనివారం ఐదు క్విం టాళ్ల ఉప్పు ప్యాకెట్లు గంట వ్యవధిలో అమ్ముడ య్యాయని ఎన్బీటీనగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి ఒకరు తెలిపారు. నగరంలో అనేకచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చారుు. అధిక ధరలకు ఉప్పు విక్రరుుస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 4,500 కిలోల ఉప్పు బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాల్లో భారీగా కొనుగోళ్లు..
వికారాబాద్ జిల్లాలో చాలామంది ముందు జాగ్రత్తగా 25 కిలోల బస్తాలను కొనుగోలు చేశారు. వికారాబాద్, ధారూరు, మర్పల్లి, పరిగి తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు ఉప్పు విక్రరుుంచారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోల్‌సేల్ ట్రేడర్స్ వద్ద ఉదయం నుంచి రిటైల్ షాపుల వారు యాభై కిలోల బ్యాగులను పెద్దమొత్తంలో కొనుగోలు చే శారు. ఒక్కొక్కరు ఐదు నుంచి పది, పాతిక బ్యాగుల చొప్పున కొనుగోలు చేసుకొని వెళ్లారు. గజ్వేల్‌లో జనం దుకాణాల ముందు బారులుదీరి బస్తాల కొద్ది తీసుకెళ్లారు. వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు రూ.15 ధర కలిగిన ఉప్పు ప్యాకెట్‌ను రూ.వందల్లో విక్రరుుంచారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఒక్కొక్కరు పది ఇరవై ప్యాకెట్లు కొన్నారు. గ్రామాల నుంచి కొంతమంది సమీపంలోని పట్టణాలకు వచ్చి బస్తాలకు బస్తాలు కొనుగోలు చేసి ఆటోలు, బైక్‌లపై తీసుకెళ్లారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. రూ.10, రూ.15 ధర ఉన్న ప్యాకెట్లను రూ.20 నుంచి రూ.100 వరకు విక్రరుుంచారు. యాదాద్రి జిల్లాలో నిన్నటి వరకు కిలో ఉప్పు ప్యాకెట్ రూ.10 ఉండగా శనివారం రూ.50కి విక్రరుుంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా వ్యాపారులు ఉప్పు ధరలు పెంచేశారు. సంగారెడ్డి జిల్లాలో వ్యాపారులు కిలో ఉప్పు ధర రూ.30 నుంచి రూ.400 వరకు చెప్పారు. వినియోగదారులు రూ.30 నుంచి రూ.150 కిలో చొప్పున కొనుగోలు చేశారు.
పుకార్లు నమ్మొద్దు
ఉప్పు కొరత ఏర్పడిందని జరుగు తున్న ప్రచారాన్ని ప్రజ లు నమ్మొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పుకార్లు సృష్టించే వారిపై, ఉప్పు కృత్రిమ కొరత సృష్టించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
- ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి
సరిపడా నిల్వలున్నాయి
ఉప్పు నిల్వలు సరిపడా ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క హైదరాబాద్‌లోనే 9 స్టాక్ పారుుంట్లలో 70 వేల కిలోల ఉప్పు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు రేషన్ దుకాణాల నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా నిత్యావసర సరుకు నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి.
- సి.వి.ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్
ఇంత డిమాండ్ ఎప్పుడూ లేదు
ఉప్పుకు ఇంత డిమాండ్ ఎప్పుడూ లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల నుంచి వ్యాపారులు ఫోన్ చేసి ఉప్పు బ్యాగులు పంపించాలని అడిగారు. ఒక్క ఉప్పు ప్యాకెట్‌తో సరిపెట్టుకునే కుటుంబాలు సైతం 25 కేజీల బ్యాగు తీసుకువెళ్లారు. దీంతో స్టాకు పూర్తిగా ఖాళీ అరుుంది.
- శ్రీమాన్, హోల్‌సేల్ వ్యాపారి, జనగామ