సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను వైభోవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటకశాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ నెల 17-19 తేదీల్లో జరగనున్న జాతరకు 1.2 కోట్ల మంది భక్తులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ నెల 19న సీఎం కె.చంద్రశేఖరరావు మేడారం జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు.
శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఈ జాతర నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ వచ్చాక జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ రూ.175 కోట్లు విడుదల చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, మంచినీరు, స్నానఘట్టాలు, టాయిలెట్లు, ఇతర సదుపాయాలను కల్పించామని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా మేడారం సందర్శనకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతర కోసం ఆర్టీసీ ద్వారా 4 వేల బస్సులు, దక్షిణ మధ్య రైల్వే ద్వారా 16 రైళ్లు ఏర్పాటు చేశారని చెప్పారు.