గగనం నుంచి నగర వీక్షణం! | The view from the sky! | Sakshi
Sakshi News home page

గగనం నుంచి నగర వీక్షణం!

Published Tue, Dec 8 2015 4:04 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

గగనం నుంచి నగర వీక్షణం! - Sakshi

గగనం నుంచి నగర వీక్షణం!

సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి వీక్షిస్తే భాగ్యనగరం ఎలా కనిపిస్తుంది.. పాలరాతి అద్భుతం బిర్లామందిరం, చారిత్రక చార్మినార్, గోల్కొండ కోటలు, హుస్సేన్‌సాగర్, ఐటీ హబ్ మాదాపూర్ పరిసరాలను ఆకాశంలో విహరిస్తూ చూడాలని ఉందా? రాష్ట్ర పర్యాటకశాఖ ఈ అరుదైన అవకాశాన్ని సాకారం చేసే ప్రయత్నాల్లో ఉంది. విదేశీ నగరాల్లో అందుబాటులో ఉన్న హెలిటూరిజాన్ని హైదరాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ప్రైవేటు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని గగనతల పర్యాటకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే జనవరి చివరి నాటికి తొలుత ఒక హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చి, ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తే మరికొన్ని హెలికాప్టర్లను తీసుకురావాలని భావిస్తోంది.

అవికూడా విజయవంతంగా నడిస్తే సొంతంగానే హెలికాప్టర్లను సమకూర్చుకునే ఆలోచనలో ఉంది. తొలి ప్రయోగం సానుకూలంగా ఉంటే, దాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు హాట్ ఎయిర్ బెలూన్, సీ ప్లేన్ ద్వారా కూడా గగనతలం నుంచి నగర వీక్షణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ సోమవారం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వక్షించారు. తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా జనవరిలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

 చైనా తరహాలో...
 గతంలో సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి పర్యాటక శాఖ చర్యలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలో అనువైనవి తెలంగాణలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో అధికారుల బృందం చైనాలో పర్యటించినప్పుడు ఈ గగనతల వీక్షణపై దృష్టి సారించింది. ఇప్పటివరకు మన దేశంలో ఈ తరహా ప్రయత్నాలు అంతగా జరగలేదు. మొదటిసారి హైదరాబాద్‌లో దాన్ని అమలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. చైనాకు భారీ సంఖ్యలో విదేశీ పర్యాటకులు పోటెత్తుతుండగా, మన దేశంలో విదేశీ పర్యాటకులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడులకు వారి తాకిడి ఉన్నా.. తెలంగాణ బాగా వెనకబడింది. విదేశీయులను ఆకట్టుకునే ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ వాటికి అంతగా ప్రచారం లేకుండాపోయింది.

 టూర్ ఆపరేటర్లతో సంప్రదింపులు
 విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూర్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ట్రైబల్, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నల్లమల అటవీ ప్రాంతం, సోమశిల, ఫరహాబాద్, మల్లెల తీర్థం, శ్రీశైలం పరిసరాలను ఎకో టూరిజంగా, వరంగల్ జిల్లా మేడారం, లక్నవరం, తాడ్వాయి, మల్లూరు, గట్టమ్మ దేవాలయ ప్రాంతాలను ట్రైబల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. బౌద్ధ, జైన, రామాయణ సర్క్యూట్‌లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించే పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చందూలాల్ చెప్పారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పర్యాటక కార్యదర్శి వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement