సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష | satyam ramalinga raju handed out 7 years sentence and 5 crores fine | Sakshi
Sakshi News home page

సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష

Published Thu, Apr 9 2015 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

satyam ramalinga raju handed out 7 years sentence and 5 crores fine

ఆయనకు, రామరాజుకు రూ. 5 కోట్ల వంతున జరిమానా
మిగిలిన 8 మంది నిందితులకు రూ. 25 లక్షల జరిమానా
మొత్తం పదిమంది దోషులకూ ఏడేళ్ల జైలుశిక్ష
ఇప్పటికే 33 నెలల శిక్ష అనుభవించిన రామలింగరాజు

దేశ విదేశాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బైర్రాజు రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఆయన సోదరుడు రామరాజుకు కూడా ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో మొత్తం పది మంది దోషులు ఉన్నారు. మొదటి దోషి రామలింగరాజు కావడంతో ఆయన మీద తీర్పు ముందుగా వెలువడింది. ఇప్పటికే ఆయన 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

 

 

హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది. ఆయనతో పాటు మొత్తం పది మంది దోషులకు కూడా ఏడేళ్ల జైలుశిక్షనే విధించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు మినహా మిగిలిన 8 మంది దోషులకు మాత్రం రూ. 25 లక్షల చొప్పున జరిమానా విధించారు. దోషులను నేరుగా కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది.


తాను పలు సేవా కార్యక్రమాలు చేపట్టానని, వాటిని దృష్టిలో పెట్టుకునైనా శిక్ష తగ్గించాలని రామలింగరాజు కోర్టును వేడుకున్నారు. తాను ఈఎంఆర్ఐ, 108, తాగునీటి పథకాల లాంటి అనేక సేవలు చేశానని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సి ఉందని.. అందువల్ల శిక్ష తగ్గించాలని కోరారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి చక్రవర్తి మాత్రం ఈ వాదనతో  ఏకీభవించలేదు.

దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తన తీర్పును గురువారం నాడు ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ చైర్మన్ రామలింగరాజును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.  రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలంపై నేరం రుజువైంది.

 



2009 జనవరిలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణంలో రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.

కోర్టు మొత్తం 226 మంది సాక్షులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది.  కాగా సత్యం కుంభకోణంపై  ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది.
 
ఈ కేసు ముఖ్యాంశాలు....
2009 జనవరి 7: సత్యం కంప్యూటర్స్‌లో 7,100 కోట్లు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. తాను పులి మీద స్వారీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్‌ హోల్డర్లకు లేఖ రాశారు.
 
జనవరి 9: రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
జనవరి 9: ఈ కేసులో విచారణ మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు.
 
జనవరి 11: రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
 
ఫిబ్రవరి 14: కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు.
 
ఏప్రిల్ 7: సీబీఐ కోర్టుకు ప్రధాన చార్జిషీట్‌ను సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement