ఓఆర్‌ఆర్‌పై సోలార్ కాంతులు
⇒హెచ్‌ఎండీఏ అధ్యయనం
⇒పలు విభాగాలకు ఉపయోగం
⇒భారీగా విద్యుత్ బిల్లుల ఆదా
సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో సోలార్ ప్రాజెక్టు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. ఈ మేరకు 156.9 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ మార్గం చుట్టూరా ఉన్న గ్రోత్ కారిడార్ సర్వీస్ రోడ్లలో సోలార్ పలకాలు అమర్చేందుకు అనువుగా ఉన్న ప్రాంతాల గుర్తింపు..సాధ్యాసాధ్యాలపై హెచ్‌ఎండీఏ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
దాదాపు 320 కిలోమీటర్ల మేర ఉన్న సర్వీసు రోడ్లలో ఏర్పాటుచేసే సోలార్ వ్యవస్థ ద్వారా కొన్ని వందల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి రాత్రి సమయాల్లో ఎల్‌ఈడీ బల్బుల వెలుతురుకు వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా ఏడాది పొడవునా రూ.కోట్లలో వస్తున్న విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు అస్కారం ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(హెచ్‌టీఎంఎస్) సేవల్లో భాగంగా ఏర్పాటుచేస్తున్న సైన్ స్క్రీన్ బోర్డులకు కూడా ఈ సోలార్ పవర్‌ను వినియోగిస్తే మంచిదని భావిస్తున్నారు.
హెచ్‌టీఎంఎస్ సేవలపై నిఘా ఉంచే నానక్‌రామ్‌గూడలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కూడా సోలార్ విద్యుత్‌ను మళ్లించడం ద్వారా హెచ్‌ఎండీఏ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే అవకాశముంటుందని అంటున్నారు. ‘205 కిలోమీటర్ల నాలుగు లేన్ల అహ్మదాబాద్–రాజ్‌కోట్ హైవేలో పీవీ రూఫ్ ద్వారా 104 మెగావాట్ల విద్యుత్‌ను, 93 కిలోమీటర్ల అహ్మదాబాద్–వడోదర నేషనల్ హైవేలో సోలార్ ద్వారా 61 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగారు. 320 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్లలో సోలార్ ప్యానెల్స్‌ను అమర్చి దాదాపు 180 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చ’ని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఓఆర్‌ఆర్‌లోని సర్వీసు రోడ్లలో సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన వివరించారు.
అధ్యయనం పూర్తయ్యాక అంతా సవ్యంగా ఉందనుకుంటే తదుపరి కార్యచరణ ఉంటుందన్నారు. ఫ్రాన్స్‌లోనైతే గతేడాది డిసెంబర్‌లో ఏకంగా ప్రపంచంలోనే తొలి ‘సోలార్ హైవే’ని ప్రారంభించారు. రోడ్డు మీదనే సౌర ఫలకాలు ఏర్పాటుచేసి కొన్ని వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇక్కడ కూడా హైవేల్లోనూ అదే ట్రెండ్ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.