'డిసెంబర్ 6'కు భారీ బందోబస్తు
హైదరాబాద్: బాబ్రీ మసీద్ కూల్చివేతకు గురైన డిసెంబర్ 6న.. వివిధ వర్గాలు ఏటా నిర్వహించే బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావిడికూడా మొదలుకావడంతో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉన్నందున పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది.
బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొందరు బ్లాక్ డేకు సిద్ధమవుతుండగా... విజయ్ దివస్ కోసం మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా దక్షిణ మండలం పోలీసులు ఎవరికీ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదు. బందోబస్తు కోసం పోలీస్ సిబ్బందితో పాటు ఆర్ముడ్ రిజర్వుడ్ ఫోర్స్, కమాండో టీమ్స్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లను పెద్ద సంఖ్యలో వినియోగించుకోనున్నారు.
చార్మినార్ సందర్శకులకూ..
బ్లాక్ డే నేపథ్యంలో పాతనగరం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. చార్మినార్ ను సందర్శించే పర్యాటకులను సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. పర్యాటకులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు ఇతర వస్తువులను చార్మినార్ పైకి అనుమతించడం లేదు. బ్యాగులను తనిఖీ చేసి వాటన్నింటిని ప్రధాన గేటు వద్దే ఉంచుతున్నారు.
144 సెక్షన్ అమలు...
ఈ నెల 6వ తేదీన పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురి కంటే ఎక్కువగా గుమికూడ రాదని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే నిర్ధేశిత ప్రార్థనలు, పూజలు యధావిధిగా కొనసాగించుకోవచ్చు నన్నారు. అపరిచిత వ్యక్తులు తారసపడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని, వదంతులను నమ్మవద్దని కోరారు.
రౌడీషీటర్లపై నిఘా
దక్షిణ మండలంలో ఇప్పటికే నమోదైన పేరు మోసిన రౌడీషీటర్లపై నిఘా పెంచారు. ఇటీవల సత్ప్రవర్తన గల రౌడీలపై నమోదైన రౌడీషీట్‌లను తొలగించినప్పటికీ, వారిని కూడా ఓ కంట కనిపెడుతున్నారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.