ముందే తాకిన సెగ
నిన్నటి వరకు చలితో గజగజ వణికిపోయిన నగరవాసులపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం వేళ బయటకి వెళ్లాలం టే భయపడే పరిస్థితి వచ్చేసింది. గతేడాది ఫిబ్రవరి మొదటి వారంలో రోజుకు సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఈసారి ఏకంగా 32-33 డిగ్రీల మేర నమోదవుతుండటంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మార్చి తర్వాత మరెలా ఉంటుందోనని భయపడుతున్నారు. గ్రేటర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న వాహన, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి రెండు వారాల ముందే గ్రేటర్‌కు ఎండసెగ తగిలింది.
సాక్షి, సిటీబ్యూరో: తెల్లవారుజామున చలి.. తెల్లవారుతుండగానే సెగ.. ఇప్పుడు నగరంలో నెలకొన్న వాతావరణం ఇది. వేసవికి ముందే ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఉక్కపోస్తోంది. క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. ఎండ తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు వడదెబ్బ బారిన పడటంతో పాటు టూవీలర్స్‌పై ప్రయాణించే మార్కెటింగ్ ఉద్యోగులు, యువ తీ యువకులు చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున చలి, మధ్యాహ్నం ఎండ వల్ల చర్మం పొడిబారుతోంది. ఉక్కపోత వల్ల మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. బయటికి వెళ్తే నీళ్ల బాటిల్, గొడుగు విధిగా వెంట తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చల్లని గాలి కోసం తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి.
టైట్ జీన్స్, బిగుతైన దుస్తులకు దూరంగా ఉంటే మేలు.
చెమట పొక్కులు రాకుండా శరీరానికి చల్లదనాన్ని పంచే కూల్ పౌడర్లు వాడాలి.
చన్నీటితో రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) స్నానం చేయాలి.
చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకూడదు. పనులుంటే ఉదయమే పూర్తి చేసుకుని ఎండ ముదిరే సమయానికి ఇంటికి చేరుకోవాలి.
బయటికి వెళ్లే ముందు చర్మానికి సన్‌లోషన్స్ తప్పనిసరి.
మసాలా ఆహారానికి బదులు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
పానీయాలకు బదులు పండ్ల రసాలు, పండ్లు, కొబ్బరి బొండాలు తాగాలి.