
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్ శేఖర్ గుప్తా శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారు దేశ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్తా బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపథ్యాన్ని సీఎం వివరించారు.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ చెప్పారు. పాలకుల దృక్పథంలో మార్పు రాకపోతే ఈ పరిస్థితి ఎన్నటికీ మారదన్నారు. అనేక రాష్ట్రాలు సమ్మిళితంగా ఉన్న మన దేశంలో సమాఖ్య స్ఫూర్తి కొరవడటం వల్ల అన్ని విషయాల్లో సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలతో శేఖర్ గుప్తా ఏకీభవించారు.
దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రయత్నాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలు, ఫెడరల్ వ్యవస్థకు ఉండాల్సిన లక్షణాలు, దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి అవరోధాలు, దేశాభివృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలు, వాటిని అధిగమించే మార్గాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా వారు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment