నేను హైదరాబాద్లో పుట్టలేదు
‘సినిమాలు నాకు ఎన్నో విషయాలు నేర్పాయి. నిజానికి ఎవరికైనా సినిమా జీవితం రావడం ఒక ఉత్తమ గురువు. వ్యక్తిగత జీవితం కూడా పబ్లిక్ అయ్యే పరిస్థితి. అదే సమయంలో ఎక్కడికి వె ళ్లినా గొప్ప గుర్తింపు’ అంటూ సినిమా జీవితంలోని వైరుధ్యాలను వెల్లడించారు సీనియర్ బాలీవుడ్ నటి, పద్మభూషణ్ షర్మిలా ఠాగూర్. బుధవారం నగరంలో యంగ్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సెలబ్రేట్ ఉమెన్‌హుడ్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
హైదరాబాద్ : వికీపీడియాలో చెప్పినట్టుగా నేను 1946లో హైదరాబాద్‌లో పుట్టలేదు. 1944లో కాన్పూర్‌లో పుట్టాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంశంలో 5వ తరం మహిళను. నన్ను నటిగా జనం గుర్తించడం మొదలుపెట్టాక, వారి హృదయాల్లో స్థానం సంపాదించగలిగాను. అప్పుడే గ్లామర్ గాళ్ అనే ఇమేజ్ నుంచి దూరమవ్వాలనే ఆలోచన.. ఇంకా మంచి పేరు పొందాలనే తపన పెరిగింది.
‘ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’ సినిమా పెద్ద హిట్. తర్వాత నేను టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని కలిశాను. ఆ తర్వాత ‘ఆరాధన’ సినిమా రిలీజ్. ‘మౌసమ్’లో తల్లి, కూతురు పాత్రలు చేయడం ఎంజాయ్ చేశాను. ఏ పాత్రలో నటించినా, అది పూర్తి చేసిన వెంటనే అందులో నుంచి బయటకు వచ్చేయడం నా పద్ధతి.
పెళ్లి ఓ గొప్ప బాధ్యత..
పెళ్లి, పిల్లల్ని కనడం ద్వారా మనం సొసైటీలో పెద్ద భాగం అవుతాం. మరింత మందితో కలిసి జీవించడం నేర్చుకుంటాం. మన బాధ్యతలూ ఇనుమడిస్తాయి. ఆది నుంచీ మాది ఉమ్మడి కుటుంబం. అందుకే షేరింగ్, కేరింగ్, సర్దుబాటు సహజంగానే వచ్చేసింది. టైగర్, నేను పాత కాలపు కుటుంబాల నుంచి వచ్చాం. మాకు కొన్ని ఆహారపు అలవాట్ల దగ్గర తప్ప పెద్ద వ్యత్యాసాలేవీ రాలేదు.
పంచుకోవడాన్ని మరచిపోతున్నాం..
ప్రస్తుత తరం షేరింగ్, కేరింగ్ గురించి మరచిపోతున్నారు. టీవీ ఎదురుగా కూర్చుని భోజనాలే తప్ప కబుర్లతో కలిసి తినడం తగ్గిపోయింది. కలిసి జీవించడమనే కుటుంబ బంధం క్షీణిస్తోంది. మొబైల్, ఇంటర్నెట్ యుగం అన్నింటినీ మార్చేసింది.
సినిమా ప్రొఫెషన్.. ఫ్యాషన్ అయింది
నేను నటన ప్రారంభించినప్పుడు ఈ ప్రొఫెషన్‌కు అంత ఆదరణ లేదు. అయితే, కాలక్రమంలో యువతులు ఎంచుకుంటున్న టాప్ ప్రొఫెషన్‌లో ఒకటిగా మారింది. విదేశాలకు వెళితే ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువు ఆపేసి మరీ పిల్లలు సినిమాల్లో నటిస్తామంటూ వస్తున్నారు. అయితే ఇది కఠినమైన వృత్తి. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొందరు నన్ను తక్కువగా చూసేవారు.
మరికొందరు నా సినిమాలు అందులోని పాత్రల గురించి మాత్రమే మాట్లాడేవారు తప్ప నన్ను నన్నుగా చూసేవారు కాదు. అయితే ఒక మనిషి జీవితాన్ని అతని చదువు మాత్రమే నిర్మిస్తుందనేది వాస్తవం. నాకు 3 డాక్టరేట్స్ ఉన్నా, జీవితమనే విశ్వవిద్యాలయంలో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.