నిమజ్జన యాత్ర మార్గాల్లో షీ టీంల నిఘా | She teams surveillance in the nimajjanam | Sakshi
Sakshi News home page

నిమజ్జన యాత్ర మార్గాల్లో షీ టీంల నిఘా

Published Thu, Sep 8 2016 8:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

She teams surveillance in the nimajjanam

వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల షీ టీం సభ్యులు నిఘా వేయనున్నారు. ఈవ్ టీజింగ్...అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించే బాలికలు, అమ్మాయిలు, యువతులు, మహిళలు ఆనందంతో కేరింతలు కొడుతూ...గణపతి బొప్పా మోరియా అంటూ నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్ ట్యాంక్, సఫీల్‌గూడ చెరువు, కాప్రా చెరువు, చర్లపల్లిలో కొత్తగా రెడీ చేస్తున్న చెరువుల్లో సందడి చేయడం అనవాయితీగా వస్తోంది. ఏటికేడు గణపతి విగ్రహాలతో వచ్చే మహిళ భక్తుల సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 100 మంది వరకు సిబ్బంది ఆకతాయిలపై కన్నేసి ఉంచుతారు. ఎక్కడా ఎవరైనా అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చినా, వీరి కంటపడినా అరెస్టు చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని నిమజ్జన యాత్ర మార్గాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు.


‘మఫ్టీ’తో నిఘా...
సందట్లో సండేమియా అన్నట్టు జనాల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. సంప్రదాయ కుటుంబానికి చెందిన నగరవాసులు ఒంటి నిండా ఆభరణాలు ధరించి...శోభాయమానంగా గణపతి మండపాల నుంచి నిమజ్జనం ఘాట్ వరకు జరిగే నిమజ్జన యాత్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనబడతారు. ఇదే అదునుగా భావించి జనాల మధ్యలోనే దొంగలు తమ పనికానిచ్చే అవకాశముంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. వీరిలో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుండగా, మరికొందరు మఫ్టీలో నిఘా వేయనున్నారు.


సీసీ కెమెరాలతో పర్యవేక్షణ...
కమిషనరేట్లలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను బలగాల పహారాతో పాటు నిఘా నేత్రాలతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభ యాత్రను అధికారులు వీక్షిస్తూ ఎప్పటికప్పుడూ స్థానిక పోలీసు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ నిమజ్జన యాత్రల్లో లక్షలాది మంది భక్తుల పూజలతో వేలాది వినాయకులు తరలివస్తాయి. పోలీసులు జంక్షన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలతో ఆయా ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగిస్తున్నారు. సీసీకెమెరా మౌంట్ వెహికల్‌లను, ఆశ్విక దళాలను ఇప్పటికే భద్రత కోసం వినియోగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement