ఎస్సై ఈవెంట్స్‌లో 40 శాతమే అర్హత!
- 75 వేల మంది హాజరవగా 32 వేల మంది అర్హత
- 800 మీటర్ల పరుగులోనే ఎక్కువ మంది వైఫల్యం
సాక్షి, హైదరాబాద్ : సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొలువు కోసం నిర్వహించిన ఈవెంట్స్‌లో 40% మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. తుది రాత పరీక్షకు 32,457 మంది ఎంపికయ్యారు. ప్రిలిమినరీ రాత పరీక్ష అనంతరం దేహదారుఢ్య పరీక్షలకు 91 వేల మంది అర్హత సాధించారు. వీరికి గతనెల 27 నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్స్‌కు 75,758 మంది హాజరయ్యారు. దేహదారుఢ్య పరీక్షల అనంతరం 32,457 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఈవెంట్స్‌లో ఎక్కువ శాతం 800 మీటర్ల పరుగులో విఫలమయ్యారు. ఎత్తు, ఛాతి కొలతల్లో 65,634 మంది అర్హత సాధిం చినా.. 800మీటర్ల పరుగుకు వచ్చే సరికి అందులో సగం మంది కూడా అర్హత సాధించలేదు.
మొదట పరుగు.. తర్వాతే పరిశీలన
ఎస్సై ఈవెంట్స్ సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ విధానంలో మార్పులు చేసింది. ఎస్సై ఈవెంట్స్‌లో మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత ఈవెంట్స్ నిర్వహించడంతో అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయారు. అభ్యర్థులు కూడా కాస్త ఇబ్బందులకు గురయ్యారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15 నుంచి చేపట్టనున్న కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో పీఆర్‌బీ కాస్త మార్పులు చేసింది. మొదట అభ్యర్థుల ఆధార్, బయోమెట్రిక్ పరిశీలించిన తర్వాత 800, 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నారు. వీటిలో అర్హత సాధించిన వారికి అదే రోజు లేదా తర్వాతి రోజు ఎత్తు, ఛాతి తదితర ఈవెంట్స్ నిర్వహించేలా మార్పులు చేశారు. అభ్యర్థులందరూ వీటిని పరిగణనలోకి తీసుకోవాలని బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు స్పష్టం చేశారు. ఈవెంట్స్ అన్నింట్లో అర్హత సాధించిన వారికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.