
ఎస్‌ఐ దాష్టీకం
సాక్షి, సిటీబ్యూరో: హారన్ కొట్టిన పాపానికి ఓ ఎస్‌ఐ నడిరోడ్డుపై గ్యాస్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. హెల్మెట్‌తో తీవ్రంగా కొట్టడంతో బాధితుడి కుడి చెయ్యి విరిగి పోయింది. తోటి సిబ్బంది ఠాణాకు వెళ్లి ఎస్‌ఐపై ఫిర్యాదు చేస్తే బెదిరించి పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని సైతం ఖాకీలు బెదిరించడంతో చికిత్స పూర్తి కాకుండానే పారిపోయి ఇంటికొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ... గోల్నాకకు చెందిన కొత్తపల్లి జంగయ్య (28) కొండాపూర్‌లోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్.
తన ఆటోలో ప్రతి రోజు హెచ్‌పీ గ్యాస్ గౌడాన్‌కు వెళ్లి అక్కడి నుంచి సిలిండర్లను నింపుకుని వినియోగదారులకు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈనెల 12న ఉదయం తన ఆటో (ఏపీ 11 టీఏ 1989)లో కొండాపూర్ వెళ్తున్నాడు. షేక్‌పేట వద్దకు రాగానే అతని ఆటోకు ముందు బైక్ (ఏపీ 28 సీఏ 4253)పై సివిల్ డ్రెస్‌లో ఎస్‌ఐ వెళ్తున్నాడు. తనకు దారి ఇవ్వాల్సిందిగా జంగయ్య హారన్ కొట్టాడు. హారన్‌కు చిరెత్తిపోయిన ఎస్‌ఐ తన బైక్‌ను ఆటోకు మరింత అడ్డంగా తెచ్చాడు. దీంతో జంగయ్య మరోసారి హారన్ కొట్టాడు. ఇక అంతే..బైక్‌ను ఆపిన ఎస్‌ఐ ఆటోను అడ్డుకుని తన హెల్మెట్‌తో జంగయ్యపై విచక్షణ రహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన జంగయ్య ఆటోలోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు కాపాడేందుకు వెళ్లగా తాను ఎస్‌ఐనంటూ బెదిరించడంతో వారు భయపడ్డారు.
ఎస్‌ఐ వెళ్లిపోయిన తర్వాతస్థానికులు 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్‌లో అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వైద్యులు అతడిని ఆసుపత్రిలో చేర్చుకొని.. మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ నెంబర్ 23562)గా పరిగణించి చికిత్స జరిపారు. కుడి చేతికి ఎక్స్‌రే తీయగా బొక్క విరిగిపోయినట్లు వచ్చింది. విషయం తెలుసుకున్న గ్యాస్ సిబ్బంది వచ్చి ఉస్మానియాలో ఉన్న జంగయ్యను పరామర్శించారు. జరిగిన విషయంపై అదే రోజు వారు గొల్కొండ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ దాష్టీకంపై ఫిర్యాదు చేశారు.
అయితే అక్కడి పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదని బాధితులు తెలిపారు. ఇదిలావుండగా మరుసటి రోజు ఇద్దరు సివిల్ దుస్తుల్లో జంగయ్య వద్దకు వచ్చి బెదిరించారు. భయపడ్డ జంగయ్య చికిత్స పూర్తికాకముందే ఆసుపత్రి నుంచి పారిపోయి ఇంటికొచ్చేశాడు. ఇప్పటికైనా అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకుని బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని బాధితుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.