సాక్షి, కరీంనగర్: పోలీసులు అనగానే కఠినంగా ఉంటారు.. పరుషంగా మాట్లాడతారు.. అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ వారు కూడా మనుషులేనని.. కష్టం వస్తే.. మానవత్వంతో వెంటనే స్పందిస్తారనే దానికి ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా కరీంనగర్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఈ మాటలు నిజమే అని మరోసారి రుజువు అవుతాయి. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ఆ ప్రాంత ఎస్సై ప్రథమ చికిత్స చేయడమే కాక తన జీపులోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
వివరాలు.. జిల్లాలోని సైదాపూర్ మండలం గణపూర్ గ్రామానికి చెందిన భాషావేని కిరణ్ అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ వేసుకుని పొలానికి వెళ్లాడు. పొలం దున్నుతుండగా.. ట్రాక్టర్ కాస్తా ఉల్టా అయ్యింది. ఇది గమనించిన ఇరుగుపొరుగు రైతులు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ఎస్‌ఐ ప్రశాంత్ రావు వెంటనే స్పందించి కిరణ్‌ను తన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ప్రశాంత్ రావు.. కిరణ్ గుండెల మీద చేతులతో ఒత్తి ఊపిరితీసుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫసి అబీబ్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా.. డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ డీజీపీ పోలీస్ ట్విటర్‌లో రీట్వీట్ చేశారు. అవసరమైన ప్రతి సమయంలో ఇలాంటి ఓ మంచి పోలీసు ఉంటాడంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ప్రశాంత్ చూపిన మానవత్వాన్ని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment