
సమాజ్‌వాదీ రాష్ట్ర అధ్యక్షుడిగా సింహాద్రి
సాక్షి, హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో సోమనబోయిన రామలింగయ్య, భద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా సింహాద్రి జన్మించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు నల్లగొండలో, పీజీ, పీహెచ్‌డీ ఉస్మా నియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 35 ఏళ్ల పాటు ఓయూలో ఫ్రొఫెసర్‌గా పని చేశారు.
30 ఏళ్ల నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమంపై 1996 నుంచి ప్రొఫెసర్ జయశంకర్‌తో కలసి అనేక పుస్తకాలు రాశారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రోడ్డు మ్యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. ఓబీసీ స్థితిగతులపై అనేక పరిశోధనలు చేయడమే కాకుండా, పుస్తకాలూ ప్రచురించారు. ‘మండలి ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి–రాజకీయాలు’ వంటి సమకాలిన అంశాలపై పుస్తకాలు రాశారు. ఓబీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.