జీవిత కాలపు ఆనందం: సింధు | sindhu special interview to sakshi | Sakshi
Sakshi News home page

జీవిత కాలపు ఆనందం: సింధు

Published Mon, Aug 22 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

రియో నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తూ ఆదివారం అర్ధరాత్రి విమానంలో సింధు, గోపీచంద్, ఫిజియో కిరణ్‌

రియో నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తూ ఆదివారం అర్ధరాత్రి విమానంలో సింధు, గోపీచంద్, ఫిజియో కిరణ్‌

పతకం సాధించిన క్షణాలు అపురూపం
ఇప్పటికీ అంతా కలలాగే ఉంది
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సింధు

సాక్షి క్రీడాప్రతినిధి మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది
దేశం నాకేం ఇచ్చిందన్నది ముఖ్యం కాదు.. దేశానికి నేనేం ఇచ్చాననేదే ముఖ్యం.. సింధు కూడా ఇదే భావనతో ఉంది. తన కోసం దేశం మొత్తం ప్రార్థించిన క్షణాన మువ్వన్నెలు గర్వపడేలా పతకం గెలిచి భారతావనిని సంతోష సాగరంలో ముంచెత్తింది. ‘నా దేశానికి పతకం తెచ్చా’ అనే భావన తనకు జీవితకాలపు ఆనందాన్ని ఇచ్చిందని చెబుతున్న ‘సింధు’.. రియోనుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తూ విమానం నుంచి వాట్సాప్‌ కాల్‌ ద్వారా ‘సాక్షి’తో ప్రత్యేకం గా మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే...

పతకం గెలిచిన తర్వాత..
మూడు రోజులు గడిచినా నేను ఇంకా అదే ఆనందంలో మునిగి ఉన్నాను. మాటల్లో చెప్పలేని ఆనందం ఇది. ఫైనల్‌ ముగిశాక బహుమతి ప్రదానోత్సవం, ఇంటర్వ్యూలు, అభినందనలు... ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఎన్నని చెప్పను. మా అమ్మా నాన్నలతో కూడా అప్పు డు మాట్లాడలేకపోయాను. అయితే అన్నింటికి మించి పోడియంపై నిలబడిన క్షణాన కలిగిన ఉద్వేగం, సంతోషంతో కన్నీళ్లు వచ్చేశాయి. ఒక వైపు భారత జాతీయ పతాకం పైకి ఎగురుతోంది. మరో వైపు స్టేడియం మొత్తం సింధు... సింధు అంటూ అరుపులు. నేను ఈ ప్రపంచం లో లేనని అనిపించింది. ఆ అనుభూతి గురించి నేను మాటల్లోనే చెప్పలేకపోతున్నాను.

ఒలింపిక్స్‌ ప్రదర్శన
పోటీలు ప్రారంభమైనప్పుడు ఫైనల్‌కు వెళతానని ఊహించలేదు. అయితే తుది పోరుకు ముందు మూడు మ్యాచ్‌లు కూడా నేను చాలా బాగా ఆడాను. చైనా క్రీడాకారిణి యిహాన్‌ వాంగ్‌ను ఓడించాక పతకం సాధించవచ్చనే నమ్మకం కలిగింది. ఒకుహరతో ఆడేటప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా నా సహజశైలిలో ఆడటం కలిసొచ్చింది.

ఫైనల్లో ఓటమి
నిజాయితీగా చెప్పాలంటే కరోలినాతో తొలి గేమ్‌ గెలిచాక స్వర్ణం సాధిస్తున్నాననే నమ్మకం కలిగింది. కానీ ఒలింపిక్‌ ఫైనల్‌ ఇది. అందుకే ఆమె మరింత పట్టుదల ప్రదర్శించింది. నాకూ మంచి అవకాశాలు వచ్చినా కొన్ని సార్లు తడబడ్డాను. గోపీ సర్‌ పదే పదే ధైర్యం నూరిపోశారు. అయితే మూడో గేమ్‌లో ఆమె 13 పాయింట్లకు వెళ్లినప్పుడు లయ కోల్పోయాను. అక్కడ రెండు పాయింట్లు వస్తే తేడా ఉండేది. చివరకు సర్‌ మాత్రం ‘చాలా బాగా ఆడావు. ఇంత దూరం వస్తామని మనమూ అనుకోలేదు’ అన్నారు. గత మూడు నెలలు నేను తీవ్రంగా కష్టపడ్డాను. సర్‌ ఏది చెబితే అది చేశాను. సొంత ఇష్టాలు, సరదాలు అన్నీ మానేసి కఠోర సాధన చేశాను. దానికి దక్కిన ఫలితమే ఇది.

అంచనాల ఒత్తిడి
నేను టీవీలు, పత్రికలు చూడలేదు. కానీ భారతదేశమంతా నా గురించి ఆలోచిస్తోందని, స్వర్ణాన్ని ఆశిస్తోందని తెలుసు. ప్రధాని నుంచి సాధారణ వ్యక్తి దాకా నాపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నేను ఒత్తిడి మాత్రం పెంచుకోలేదు. అందుకే ఫైనల్లో కూడా అంత దీటుగా ఆడగలిగా. ఆశ్చర్యకరంగా రియోలో నాకు పెద్ద ఎత్తున అభిమానులనుంచి మద్దతు లభించింది. స్టేడియంలో ఒక మూల స్పెయిన్‌ దేశస్తుల బృందం మినహా మిగతా వారంతా ఇండియా గెలవాలనే కోరుకున్నారు. ప్రతీ పాయింట్‌కు నన్ను ఉత్సాహపరిచారు. దాంతో పరాయి దేశంలో ఆడుతున్న భావనే రాలేదు. నా కోసం ప్రార్థించిన, అండగా నిలిచినవారందరికీ కృతజ్ఞతలు.

దైవభక్తి, లాల్‌దర్వాజా బోనాలు
నా విజయం వెనక దేవుడి దయ ఉందని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఎంత కష్టపడినా దైవం సహకారం అవసరం. పోటీలకు ముందు లాల్‌దర్వాజా బోనాలకు వెళ్లింది కూడా ఆ నమ్మకంతోనే. వేరే ఇతర దేవుళ్లకు కూడా నేను మొక్కుకున్నాను. ఇక పోటీల్లో పసుపు బట్టలతోనే దిగడంలో ప్రత్యేక సెంటిమెంట్‌ ఏమీ లేదు. కానీ తొలి మ్యాచ్‌ తర్వాత దానిని కొనసాగించాను. గేమ్స్‌ విలేజ్‌లో ఆహారపరంగా ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. అందుబాటులో అన్నీ ఉన్నా... ఎలాంటి సమస్యలు రాకూడదని జాగ్రత్త పడేవాళ్లం. నేను పతకం గెలిచిన రోజున గేమ్స్‌ విలేజ్‌లో పెద్ద పండగ వాతావరణం కనిపించింది. నాపై ఇతర ప్లేయర్లు కురిపించిన అభిమానానికి కృతజ్ఞురాలిని.

సింధు విజయం వెనుక గురువు గోపీచంద్‌ మార్గనిర్దేశనం, ఆమెతో సమానంగా పడిన శ్రమ ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు 24 గంటలు పతకం సాధించడమే లోకంగా బతికానని గోపీచంద్‌ ‘సాక్షి’తో చెప్పారు. ప్రతీ చిన్న విషయం కోసం తీవ్రంగా శ్రమించామని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ట్రైనింగ్, ట్రైనింగ్‌ ఒక్కటే ధ్యాస. మేము రేపు ఓడితే మా శిక్షణలో లోపం ఉందని ఎవరూ అనుకోకూడదు అని భావించాం. ఆట, డైటింగ్, ఫిట్‌నెస్‌... ప్రతీదాంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం.

సింధు గెలుపే కాదు, ఆమె ఆట స్థాయి నిజంగా అద్భుతం. మా ట్రైనర్‌ కిరణ్‌ కూడా ఎంతో కష్ట పడ్డాడు. సింధును ఫిట్‌గా ఉంచడంలో అతనిదే కీలక పాత్ర. 20 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో మనకు పతకం వస్తుందంటే నవ్వేవారు. ఇప్పుడు వరుసగా రెండు సార్లు వచ్చింది. ఇది బ్యాడ్మింటన్‌ సాధించిన విజయం’ అని గోపీచంద్‌ ఆనందంగా చెప్పారు. కోచ్‌నే అయినా తానూ ఎక్కడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తపడ్డానని తెలిపారు. ‘కనీసం జలుబు, దగ్గులాంటివి వచ్చినా టైమ్‌ టేబుల్‌ మారిపోతుంది. అందుకే నేనూ ఆటగాళ్లతో పాటు కష్టపడ్డా. వ్యక్తిగత ఇష్టాలు, మిత్రులతో కనీసం మాట్లాడకుండా వారిని దూరంగా ఉంచాను.  సింధుకు కూడా కఠిన నిబంధనలు విధించాను. ఆమె నా నమ్మకాన్ని నిలబెట్టింది. మారిన్‌తో కూడా గెలిచేది. షటిల్‌ వేగంలో వచ్చిన మార్పు వల్ల మా వ్యూహం ఫలించలేదు’ అని గోపీచంద్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement