తెలంగాణ ఇంటెలిజెన్స్ అధిపతిగా శివధర్ రెడ్డి!
విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ శివధర్రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్రెడ్డిని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్కు అటాచ్ చేస్తూ డీజీపీ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే విశాఖపట్నం రేంజ్ డీఐజీ సి. ఉమాపతికి నగర పోలీసుల కమిషనర్గా అదనపు బాధ్యతులు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింటెడ్ డే.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన పేషీలోకి తీసుకునే అధికారుల విషయంలోనూ కసరత్తు మొదలుపెట్టారు. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు వీలుగా అనువైన అధికారుల ఎంపికపై కేసీఆర్ దృష్టిసారించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ముఖ్యమంత్రి పేషీలోకి ముఖ్య కార్యదర్శి, ఇతర కార్యదర్శులు, కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, నిఘా విభాగాధిపతి, సైబరాబాద్ కమిషనర్ తదితర కీలక పోస్టులకు సమర్థులైన అధికారుల కోసం ఆయన ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర కేడర్‌లో పనిచేసిన వారు, రాష్ర్టం నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లిన అధికారుల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు.
అందులోభాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శివధర్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డిని బదిలీ చేస్తు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమితులవుతున్నట్లు సమాచారం.