‘సూపర్’ సిక్స్ | six pack at the age fifty plus | Sakshi
Sakshi News home page

‘సూపర్’ సిక్స్

Published Fri, May 1 2015 1:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

‘సూపర్’ సిక్స్ - Sakshi

‘సూపర్’ సిక్స్

ఫిఫ్టీప్లస్...
 
బాడీబిల్డర్‌లుగా రాణించడానికి ‘ఆరు’నూరైనా ప్యాక్ తెచ్చుకోవాలని కష్టపడేవాళ్లను చూశాం. తంటాలెన్ని పడినా తెర  ‘వెలిగి’ పోవాలని  
 ఆరుపలకల్ని అందుకునేవాళ్లను చూశాం. అయితే అటు బాడీబిల్డింగ్‌కు, ఇటు సినిమా ఫీల్డ్‌కు.. మరే అవసరం లేని వ్యక్తి, కేవలం తన స్టూడెంట్‌ని  ఇన్‌స్పైర్ చేయడానికి ఆరు పలకల అపు‘రూపాన్ని’ అందుకోవాలని రెక్కలు ముక్కలు చేసుకోవడం,
 ఆ వ్యక్తి వయసు 50కిపైనే ఉండడం... చూశామా? ఏభై ఏళ్లు వచ్చేసరికే.. మెడికల్ ఇన్సూరెన్స్‌లు కట్టడంలో, డయాగ్నసిస్ సెంటర్ల చుట్టూ తిరగడంలో, ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి...  మంచి చెడులను  తెలుసుకోవడంలో బిజీ అయిపోతారు. తక్కువ తింటే చాలక, ఎక్కువ తింటే అరగక  ‘ఏం చేస్తాం? ఫిఫ్టీప్లస్ ఏజ్ కదా అంతే’అని సరిపుచ్చుకుంటూ గడిపేస్తుంటారు. ఎమ్.ఎ.గుప్తా (53)
 తరహాలో వయసును వెనక్కి పంపాలనే ఆలోచన చేసేవాళ్లు అరుదే. ఈ విజయవాడ వాసి ఏభై మూడేళ్లకు ఆరుపలకలు సాధించి యూత్‌కి సైతంఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు.            
  -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
మనవళ్లను ఎత్తుకోవాలని ఎదురు చూసే  వయసులో జిమ్‌కి వెళితేనే విచిత్రంగా చూస్తారు. అలాంటిది సిక్స్‌ప్యాక్ చేస్తానంటే... ‘ఆశ్చర్యపోయారు. వద్దని వారించారు. లేనిపోని సమస్యలొస్తాయని హెచ్చరించారు కూడా’ అని చెప్పారు ఎమ్.ఏ.గుప్తా. విజయవాడలోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సూపర్‌విజ్  సంస్థ యజమాని అయిన గుప్తా...తన ఫిట్‌నెస్ స్టోరీని ‘సాక్షి’ కి ఇలా వివరించారు.
 
 స్టూడెంట్‌కు స్ఫూర్తినివ్వాలని...

 
‘నా ఓల్డ్ స్టూడెంట్స్‌లో ఒక కుర్రాడు... కొంత కాలం క్రితం కలిశాడు. బాగా లావైపోవడం వల్ల తనకు పెళ్లికావడం లేదని చెప్పి బాధపడితే.. అతన్ని ఎలా సముదాయించాలో నాకు అర్థం కాలేదు. నిజానికి అప్పటికి నేనే ఓవర్ వెయిట్ ఉన్నా. స్టూడెంట్స్‌కి కాదు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే అది చేసి చూపించాలనేది నా పద్ధతి. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు గుప్తా.
 హైట్ 5.5, బరువు 85 కిలోల పైనే. పొట్ట తగ్గించుకోవాలని ముంబయిలో అనిల్ అంబానీకి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసే మాథ్యూ దగ్గర నుంచి అమీర్‌ఖాన్ ట్రైనర్ సత్య దాకా  పలువురు ట్రైనర్ల సూచనల్ని ఫాలో అయినా  ఫలితం కనిపించలేదు. హైదరాబాద్‌లోని ‘సోల్’ జిమ్‌లో సిక్స్‌ప్యాక్ స్పెషలిస్ట్‌గా పేరున్న వెంకట్‌ను కలిశా.  ‘సిక్స్‌ప్యాక్’ చేద్దామా?అని అడిగాడు. తొలుత జంకినా అంతకు ఎయిమ్ చేస్తే కనీసం పొట్ట తగ్గకపోతుందా? అని ఓకే చెప్పేశాను.’
 
 ఇరవై ఏళ్లు  వెనక్కెళ్లా...

 
జీవితంలో అన్ని విధాలా ముందుకు వెళుతుంటే వచ్చే ఆనందాన్ని ముందుకెళ్లే వయసు మింగేస్తుంది. అయితే ఎక్సర్‌సైజ్ పుణ్యమాని 20 ఏళ్లు వయసు తగ్గినట్టుంది. చూసినవాళ్లు కూడా అదే అంటున్నారు. ఆస్తులు.. అంతస్తులు, హోదాలు ఎన్ని ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథా అనే ది నిస్సందేహం. సిక్స్‌ప్యాక్ అనేది కేవలం ఒక సరదా తప్ప... దానిని సాధించడం వెనుక నా ఉద్ధేశం... హెల్త్‌ని ప్రమోట్ చేయడమే... ఇదీ ఒక ఎడ్యుకేషనే... నిజం చెప్పాలంటే... అన్నింటికన్నా చాలా విలువైన, అవసరమైన ఎడ్యుకేషన్. వయసంటే ఇప్పుడు కేవలం మానసిక భావనే. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.
 
పొట్ట చెక్కలైందిలా...

 
వెంకట్ స్వస్థలం కూడా విజయవాడే కావడం నాకు కలిసొచ్చింది. మిగిలిన రోజుల్లో ఇక్కడ జిమ్‌లో ఆయన సూచనలకు అనుగుణంగా చేస్తుంటే... వారాంతాల్లో తన ఫ్యామిలీని కలవడానికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ట్రైన్ చేసేవాడు. స్ట్రిక్ట్ డైట్, వర్కవుట్స్‌తో 2నెలల్లోనే బరువు  తగ్గాను.  చూసినవారి ప్రశంసలతో మరింత ఉత్సాహం వచ్చింది. రోజూ ఉదయం రెండున్నర గంటలు సాయంత్రం గంటన్నర  సమయం కేటాయించాను. ఫ్యాట్ పెంచే ఆహారం బదులు ఎనర్జీ డ్రింక్స్, అత్యధిక ప్రొటీన్‌లు అందించే విదేశీ రైస్ వినియోగం  హెల్ప్ చేశాయి. ఒక నెలపాటు వెంకట్ జిమ్‌లో చేయడానికి రోజూ హైదరాబాద్ అప్ అండ్ డవున్ చేస్తూ సిక్స్‌ప్యాక్ సాధించాను.  అయితే సిక్స్‌ప్యాక్ జీవితకాలం చాలా స్వల్పమని, ఏళ్ల తరబడి నిలవదని తెలుసు. అందుకే సాధించిన సిక్స్‌ను స్వీట్ మెమొరీగా ఫొటోషూట్ తో పాటు వీడియో తీయించుకున్నాను. ఇక ఇప్పుడున్న షేప్‌ను నిలబెట్టుకుంటే చాలు. దీని కోసం ట్రైనర్ సూచించిన విధంగా రోజుకు 45 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ సరిపోతోంది. ఓవర్ వెయిట్ విషయంలో నా దగ్గరకు వచ్చి బాధపడిన స్టూడెంట్‌కి నా ఫొటోలు, వీడియో పంపాను. అవి అతన్ని ఎంత ఇన్‌స్పైర్ చేయాలో అంతా చేశాయి.
 
వయసుతో  సంబంధం లేదు...
 
ఎక్సర్‌సైజ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. అలాగే సిక్స్‌ప్యాక్ కూడా. అయితే డైట్, వర్కవుట్, లైఫ్‌స్టైల్... ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హెవీ వెయిట్‌ను మోస్తూ అది తెచ్చే సమస్యలను ఆహ్వానించడం కన్నా... కొంత శ్రమపడితే జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. మరెంతో కాలం పాటు మజిల్స్‌ను ఫిట్‌గా ఉండేలా చేసుకోవచ్చు.
 - ఎమ్. వెంకట్, ట్రైనర్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement