నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలిన దృశ్యం
గచ్చిబౌలి/మాదాపూర్: నగరంలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌లు కూలుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ప్రమాదాల్లో కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. నిర్మాణ సంస్థలు మాత్రం ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదు. తాజాగా... సోమవారం మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు, ఒక సైట్ ఇంజినీర్ గాయపడ్డాడు. మరో ఇద్దరు కూలీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... మాదాపూర్ కాకతీయహిల్స్‌లో రెండు వేల చదరపు గజాల స్థలాన్ని అయ్యన్న ఇన్‌ఫ్రా ప్లాటినా కన్‌స్ట్రక్షన్ సంస్థ డెవలప్‌మెంట్‌కు తీసుకుంది. సెల్లార్, స్టిల్ ప్లస్ ఐదు అంతస్తులు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. ఇప్పటికే సెల్లార్ శ్లాబ్ వేశారు. సోమవారం తెల్లవారుజామున 2వ శ్లాబ్ వేస్తున్నారు. కాంక్రీట్‌ను చదును చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్‌తో పాటు పిల్లర్ నెలకొరిగాయి. దీంతో శ్లాబ్‌పై ఉన్న నలుగురు కూలీల్లో వెంకట్‌రెడ్డి(25), అప్పన్న(35) అనే ఇద్దరు పక్కకు దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్ ఇంజినీర్ సునీల్(26) శ్లాబ్‌పై నుంచి జారీ పడటంతో గాయపడ్డాడు. వెంకట్‌రెడ్డి, అప్పన్నలు మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వెంటనే డిశ్చార్జి అయ్యారు. క్షతగాత్రులను వెస్ట్ జోనల్ కమిషనర్ బీబీ గంగాధర్ రెడ్డి, ఉప కమిషనర్ మమత పరామర్శించారు. కాగా, ఈ ప్రమాదంలో బిల్డర్‌పై ఐపీసీ 237 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వూదాపూర్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.