మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్ : ప్రేమ వ్యవహారంలో విబేధాల కారణంగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి(26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నగరంలోని ఒక బహుళ జాతి సంస్థలో నాలుగు నెలల క్రితం జాయినయింది. ఆమె ప్రస్తుతం నానక్‌రాం గూడలోని సెరెనిటీ అపార్టుమెంట్‌లో ఉంటోంది. కాగా ఆమె స్నేహితుడితో ప్రేమ వ్యవహారంలో విఫలమైనట్లు సమాచారం.
ఇదే విషయంలో ఆమె, అతడు గురువారం అర్థరాత్రి వరకు ఫోన్‌లో మెసేజ్‌లు పంపుకున్నారు. తెల్లవారుజామున సమయంలో తన అపార్టుమెంట్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శుక్రవారం ఉదయం చుట్టుపక్కలవారు తెలుసుకుని స్థానికంగా అయ్యప్ప సొసైటీ కాలనీలో ఉంటున్న ఆమె సోదరుడికి సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.