
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరం సోలార్ సొబగులు సంతరించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మహానగరంలో పలు బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవంతులపై సౌర ఫలకాలు (రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ ఆర్‌టీపీవీ) ఏర్పాటుతో యేటా సుమారు 1,730 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది.
ఈ విద్యుత్‌తో నగరంలో 15 శాతం విద్యుత్ డిమాండ్‌ను తీర్చవచ్చని తాజా నివేదిక వెల్లడించడం విశేషం. ’రూఫ్‌టాప్ రెవల్యూషన్.. అన్‌లీషింగ్ హైదరాబాద్ సోలార్ పొటెన్షియల్’ అన్న అంశంపై గ్రీన్‌పీస్ ఇండియా సంస్థతోపాటు గుజరాత్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (జీఈఆర్‌ఎంఐ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు 1,193 మెగావాట్ల విద్యుత్‌ను జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లోని భవంతులపై సౌరఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది.
2.7 మెగావాట్ల విద్యుదుత్పత్తి...
మహానగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఆయా భవంతులపై సౌరఫలకాల ఏర్పాటు ద్వారా ప్రతి చ.కి.మీ.కి సరాసరిన 2.7 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అధ్యయనం తెలిపింది. సౌరఫలకాల ఏర్పాటు తో వాయుకాలుష్యం అసలే ఉండదని, కాలుష్య ఉద్గారాల ఊసే ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకసారి సౌరఫలకాల ఏర్పాటు కు పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో గృహ వినియో గదారులు విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్‌లో బహుళ ప్రయోజన స్థలాల్లో సాలీన 231 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని.. ఇక బహిరంగ ప్రదేశాలు, సెమీ పబ్లిక్ ప్రాంతాల్లో 178 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది.
రవాణా ఆధారిత ప్రాంతాలు, మిలటరీ స్థలాలు సౌరఫలకాల ఏర్పాటుకు అను కూలంగా లేవని పేర్కొంది. సౌరఫలకాల ఏర్పాటుతో గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నట్లు తెలిపింది. గ్రేటర్ పరిధిలో 8,887 భవంతులపై 1,730 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా సౌరఫలకాలు ఏర్పాటుచేసే అవకాశం ఉందని ఈ అధ్యయనం వెల్లడించడం విశేషం.