‘సోలార్’ శుద్ధి
* నీటిశుద్ధి యంత్రాన్ని కనుగొన్న యువకులు
* రూ.45వేలతో తయారీ
* ఎక్కడైనా ఉపయోగించవచ్చు
మణికొండ: విద్యుత్ అవసరం లేకుండా సోలార్‌తో నీటిని శుద్ధి చేసే పరికరాన్ని కనుగొన్నారు నగరానికి చెందిన ఇద్దరు యువకులు. ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లి శుద్ధి చేయవచ్చంటున్నారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన మొబైల్ శుద్ధి పరికరంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రూపకర్తలు పేర్కొంటున్నారు. మొబైల్ శుద్ధి పరికరానికి ఐదు సోలార్ ప్లేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో అమర్చారు. వాటిని తెరచి ఎండలో ఉంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత యంత్రం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు.
ఈ పరికరాన్ని తక్కువ స్థలంలో అమర్చుకోవచ్చు. వ్యవసాయ క్షేత్రాలు, దూరప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కారులో దీనిని తీసుకువెళ్లొచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు కార్యాలయాలు, గృహాల్లో ఇంటిపైన నీటి ట్యాంకుల వద్ద దీన్ని అమర్చితే శుద్ధి అయిన నీటిని ఇంట్లోని నల్లాద్వారాతీసుకోవచ్చు. దీనిని రూపొందించిన యువకులు బీఎం.బాలకృష్ణ, మహ్మద్ నసీర్‌అజీజ్ మంగళవారం మణికొండ శివారులోని ఓయూ కాలనీలో పరికరం పనితీరును విలేకరులకు వివరించారు.
‘ప్రజలు తాగేందుకు స్వచ్ఛమైన నీరు కష్టంగా మారిన ఈ తరుణంలో ఈ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రధానంగా తుపాన్లు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇవి అనుకూలంగా ఉంటా యి. ఎండలో ఆరు నుంచి 8 గంటల పాటు ఉంచితే 300 నుంచి 350 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. నీటిలో ఉండే రంగు, వాసన, బ్యాక్టీరియా, బురదతో పాటు మలినాలను పూర్తిగా తొలగిస్తుంది.’’ అని వారు వివరించారు.
కొత్తగా సృష్టించాలనే...
‘పది సంవత్సరాల పాటు విదేశాల్లో పనిచేశాం. మన దేశానికి అవసరమైన ఏదైనా కొత్త పరికరాన్ని సృష్టించాలనే తపనతోనే దీన్ని తయారు చేశాం.’ అని బీఎం. బాలకృష్ణ, మహ్మద్‌నసీర్ అజీజ్ తెలిపారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు. 25 సంవత్సరాల పాటు కొద్ది పాటి నిర్వహణతోనే పనిచేస్తుందన్నారు. రూ. 45 వేల ఖర్చుతోనే దీన్ని తయారు చేశామని, ఆశావహులు వస్తే ఎన్ని కావాలన్నా తయారు చేసి ఇస్తామమన్నారు. ఇతర వివరాలకు 8008363648, 8008553648 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.