‘సన్’స్ట్రోక్
- సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారసుల పోటీ
- తండ్రుల కంటే తామే బెటరంటున్న యువ నేతలు
- గ్రేటర్ కాంగ్రెస్‌లో ముదురుతున్న ఇంటి పోరు
సాక్షి, సిటీబ్యూరో ప్రతినిధి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. పలువురు గ్రేటర్ కాంగ్రెస్ ఎంపీ, ఎంఎల్‌ఏలను ఇంటిపోరు ఇబ్బంది పెడుతోంది. సాధారణంగా పదవుల్లో ఉన్న తండ్రులు తమ వారసులను రాజకీయాల్లో తీసుకు రావాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సిటీలో సీన్ రివర్సైంది. పెద్దలను పక్కనబెట్టి మరీ ముందుకు దూసుకొస్తున్నారు యువ నేతలు. తండ్రుల అభీష్టం ఎలా ఉన్నా తమకు సీట్లు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఈ మారు మీరు విశ్రాంతి తీసుకుని మాకు అవకాశం కల్పించాల్సిందేనంటూ తండ్రులకు హుకుం జారీ చేస్తున్న వారసుల తీరు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అభ్యర్థిత్వం కోసం బయట హేమాహేమీలతో పోటీపడుతున్న పలువురు నేతలు సైతం.. ఇంటిపోరుతో వేగలేక ఇబ్బందికర పరిస్థితిలో పడిపోవటం తాజా రాజకీయ వి‘చిత్రం’. ప్రస్తుతం కుమారుల నుంచి ఇంటి పోరు ఎదుర్కొంటున్న వారిలో అంజన్‌కుమార్ యాదవ్, ముఖేష్‌గౌడ్, భిక్షపతియాదవ్ తదితరులుండగా, ఉప్పల్ ఎమ్మెల్యే బి.రాజిరెడ్డి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఆయన ఈసారి టికెట్ విషయంలో సోదరుడైన లక్ష్మారెడ్డి నుంచి పోటీ ఎదుర్కొంటు న్నారు. వయోభారం రీత్యా తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన రాజిరెడ్డిని కోరుతున్నట్టు సమాచారం. ఇక, ముషీరాబాద్ ఎంఎల్‌ఏ టి.మణెమ్మ ఇంట్లోనూ వారసుల పోటీ నెలకొంది. వయోభారం కారణంగా మణెమ్మ ఈ మారు పోటీ చేసే పరిస్థితి లేకపోవటంతో కుమారుడు శ్రీనివాసరెడ్డి, కూతురు శోభారాణిలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే తర పున శ్రీనివాసరెడ్డి ఏకంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుండటం విశేషం.
నాన్నా.. నాకూ కావాలి
సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ నేను సైతం.. అంటూ వచ్చే ఎన్నికల్లో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీటు కోసం తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏదో ఒక శాసనసభ స్థానం నుంచి టికెట్ తెచ్చిపెట్టాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. అంబర్‌పేట - ముషీరాబాద్ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం తనకు దక్కుతుందన్న ధీమాలో అనిల్‌కుమార్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
నేను సైతం..
సనత్‌నగర్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డి ఈ మారు పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా శశిధర్‌రెడ్డి మున్ముందు ఢిల్లీ రాజకీయాలకే పరిమితమైతే రాష్ట్ర రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా వ్యవహరించే ప్రతిపాదనను ఆదిత్య తన తండ్రి ముందుంచిన్నట్లు విశ్వసనీయవర్గాల కథనం.
తండ్రీకొడుకుల సవాల్
శేరిలింగంపల్లి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్ యాదవ్‌లు పోటీ పడుతున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడికి టికెట్ ఇవ్వాలంటూ తండ్రీకొడుకులిద్దరూ దరఖాస్తు చేసుకోవటం విశేషం. వయోభారం కారణంగా ఈ మారు విశ్రాంతి తీసుకోవాలని రవికుమార్ యాదవ్ తండ్రికి సూచిస్తుండగా.. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. తండ్రీకొడుకుల పోటీతో ఆ నియోకజవర్గ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒకింత అయోమయం నెలకొంది.
నేనే అభ్యర్థిని..
బతిమాలడం... ఒత్తిడి తేవడం... ఏంటి అనుకున్నారో ఏమో.. ఏకంగా తానే అభ్యర్థినని ప్రకటించేసుకున్నారు రాష్ట్ర మంత్రి మూల ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. ఈ మారు తనను అభ్యర్థిగా చేయాలని విక్రమ్ గౌడ్ తన తండ్రి ముందుంచిన డిమాండ్‌ను ఆయన ఇంకా పరిగణలోకి తీసుకోకున్నా తానే అభ్యర్థినంటూ విక్రమ్ సన్నిహితుల వద్ద తేల్చేశారు.