‘పుర’చైర్మన్ ఎన్నికలు నేడు | zp chairpersons selections | Sakshi
Sakshi News home page

‘పుర’చైర్మన్ ఎన్నికలు నేడు

Published Thu, Jul 3 2014 2:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

‘పుర’చైర్మన్ ఎన్నికలు నేడు - Sakshi

‘పుర’చైర్మన్ ఎన్నికలు నేడు

 సాక్షి, ఒంగోలు: చాలా కాలం తర్వాత మున్సిపల్, నగర పంచాయతీలకు పూర్తి పాలకవర్గాలు ఏర్పాటవుతున్నాయి. వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా, ఆయా మున్సిపాలిటీల చైర్మన్లను గురువారం వార్డుసభ్యులు ఎన్నుకోనున్నారు. చైర్మన్ల ఎన్నిక అనంతరం ఆయన ప్రతిపాదించిన నేత వైస్‌చైర్మన్‌గా నియామకం కానున్నారు.
 
జిల్లాలో మొత్తం 6 చోట్ల మున్సిపల్ ఎన్నికలు మార్చినెలలో జరిగాయి. ఇందులో చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు కాగా, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీలు. అన్నిచోట్ల కలిపి మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 69 చోట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ 9, సీపీఐ, సీపీఎం చెరో ఒకటి వార్డుపదవిని కైవసం చేసుకోగా... స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించారు. గిద్దలూరులో బీఎస్పీ, చీరాలలో అత్యధికంగా స్వతంత్రులు, మార్కాపురం మున్సిపాలిటీలో సీపీఎం, సీపీఐ సభ్యులున్నారు.
 
  - ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు.. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న వారే ప్రిసైడింగ్ అధికారులుగా చైర్మన్ ఎన్నికలను నిర్వహిస్తారు.
 
 - ఉదయం తొలుత  చైర్మన్ అభ్యర్థుల నామినేషన్‌లను స్వీకరించిన అనంతరం... కౌన్సిల్‌ను సమావేశపరిచి వార్డుసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత చైర్మన్ నామినేషన్‌లను పరిశీలించి, బహిరంగ ఓటింగ్ పెడతారు. వార్డుసభ్యులు చేతులెత్తి తమ మద్దతును తెలియపరచనున్నారు.
 
 - మెజార్టీ మద్దతు లభించిన వారిని చైర్మన్‌గా ప్రకటిస్తారు. అయితే, చైర్మన్ ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌అఫిషియో సభ్యుల హోదాలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మెజార్టీకి వార్డుసభ్యుల మద్దతుతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక తతంగం పూర్తయ్యే నాటికి మధ్యాహ్నం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు కోఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకొనే అవకాశం ఉంది.  
 
 మున్సిపాలిటీల వారీగా బలాబలాలివి..
 - చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. చైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ 15 వార్డుల్లో, టీడీపీ 12 చోట్ల గెలుపొందింది. ఆరుగురు స్వతంత్రులు కాగా.. వీరంతా స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంగా ఉన్నారు. టీడీపీ ఎంపీ పులివర్తి మాల్యాద్రి ఇక్కడ ఓటేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేతో పాటు స్వతంత్రులు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపే అవకాశమున్నందున... చైర్మన్ పదవి టీడీపీకి దక్కదనే సంకేతాలున్నాయి.
 
 - మార్కాపురం మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. చైర్మన్ రిజర్వేషన్ ఓసీ మహిళ కాగా, వైస్సార్‌సీపీ 10, టీడీపీ 19 స్థానాల్లో గెలిచింది. సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ బలం 22 కనిపిస్తోండగా.. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్సార్‌సీపీకి చెందిన వారైనందున ఆ పార్టీకి రెండు ఓట్లు పడనున్నాయి. అయితే, ఇక్కడ టీడీపీ వైస్‌చైర్మన్‌గా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తామని గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణరెడ్డి ప్రకటించారు. తాజాగా, ఆయన మాట మార్చడంతో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. ఈనేపథ్యంలో కొందరు టీడీపీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి బలానివ్వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
 - చీమకుర్తిలో 20 వార్డులుండగా, చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ 8చోట్ల, టీడీపీ 12 చోట్ల గెలుపొందింది. అయితే, టీడీపీ అభ్యర్థి ఒకరు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ కాగా.. ఎంపీ టీడీపీ వైపు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా జరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
 
 - కనిగిరిలో 20 వార్డులుండగా, చైర్మన్ పదవి బీసీ జనరల్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ 8 స్థానాల్లో, టీడీపీ 11 చోట్ల గెలుపొందింది. ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఎమ్మెల్యే టీడీపీ కాగా.. ఎంపీ వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారు.
 
 - అద్దంకిలో 20 వార్డులుండగా, ఎస్సీ మహిళకు చైర్మన్ పదవి రిజర్వుఅయ్యింది. ఇక్కడ 15 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత చూపగా, వైఎస్సార్‌సీపీ మాత్రం 5 స్థానాల్లోనే గెలిచింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండగా.. ఎంపీ టీడీపీ తరఫున ఉన్నారు.
 
 - గిద్దలూరులో 20 వార్డులుండగా, 11 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందగా,.. టీడీపీ ఒక్క వార్డునూ కైవసం చేసుకోలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్గంగా బీఎస్పీ తరఫున 9 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా వైఎస్సార్‌సీపీనే కావడంతో   చైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement