సంస్కారానికి సబ్బుకి సంబంధం ఏంటి? చీరల్ని కేజీల కొద్దీ అమ్మే రోజులు తిరిగొచ్చాయా? కళాతపస్వి కె.విశ్వనాథ్‌తో యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడం సాధ్యమా? ఇలాంటి ఊహించని ఎన్నో ట్రెండ్స్‌కు చిరునామా యమునా కిషోర్. అడ్వర్టయిజింగ్ రంగంలో సంచనాలకు కేరాఫ్ అడ్రస్ ఈ హైదరాబాద్ వాసి. తెలుగు యాడ్ ఫిల్మ్ మేకర్స్‌కు స్ఫూర్తి. పదేళ్ల క్రితం వాణిజ్య చిత్రాల రూపకల్పనలో ప్రయాణం ప్రారంభించిన ఈ డిగ్రీ ఫెయిల్యూర్ కుర్రాడు... వృత్తి జీవితంలో ప్రతి పరీక్ష పాసవుతూనే ఉన్నాడు. తన ప్రయాణ ‘పది’నిసలపై కిషోర్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. ఎస్.సత్యబాబు
టెన్త్ వరకు బాగా చదివినా గుంటూరులో ఎక్కువగా జరిగే నాటకాలు, సాహితీ, సినీ, సాంస్కృతిక కార్యక్రమాల చుట్టూ రౌండ్స్ కొట్టిన ఫలితం... ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్, డిగ్రీ ఫెయిల్. మొదట థియేటర్లలో ఇంటర్వెల్ టైమ్‌లో వేసే స్లైడ్స్ రూపొందించే కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేశాను. తర్వాత స్నేహితుడితో కలిసి అదే బిజినెస్ ప్రారంభించాను. స్థానిక వ్యాపార సంస్థల కోసం దాదాపు ఏడేళ్లు పనిచేశాను. ఆ తర్వాత ఆ బిజినెస్ డల్ అయింది. అప్పుడే త్రిబుల్ ఎక్స్ సోప్ కంపెనీ యజమానికి ఓ యాడ్ స్టోరీ చెప్పాను. ఆ యాడ్ నచ్చి రూ.5 లక్షలు ఇచ్చారు. అది బాగా హిట్టయింది. ఇక కళానికేతన్, ఆర్‌ఎస్ బ్రదర్స్, సువర్ణ భూమి, అంబికా దర్బార్ బత్తి, డబుల్ హార్స్ మినపగుళ్లు.. ఇలా వరుసబెట్టి అవకాశాలు వచ్చాయి.
నేర్పబోయి నేర్చుకున్నా..
కళాతపస్వి విశ్వనాథ్ గారిని ఒక యాడ్ కోసం తీసుకోవడమనే ఆలోచన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎలా అయితేనేం ఆయన్ని ఒప్పించాను. తొలి రోజే పెద్ద డైరెక్టర్‌లాగా ఆయనకి ఏదో చెప్పబోయి చివాట్లు తిన్నాను. అయితే అవే తర్వాత నాకు పాఠాలయ్యాయి. ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి సన్నివేశం, సంభాషణలు ఉండాలనే విషయం ఆయన దగ్గరే నేర్చుకున్నాను.
మనసే ముఖ్యం...
మైసూర్ దగ్గర మేల్కొటే అనే మారుమూల ప్రాంతంలో ఎస్పీ బాలు గారితో షూటింగ్. బంద్ కారణంగా మా ఫుడ్ వ్యాన్‌ని ఆపేశారు. అందరం ఆకలితో ఉన్నా, బాలు గారి గురించే నేను ఎక్కువ ఆందోళన చెందాను. అయితే ‘ఈసారికి రెండు అరటి పండ్లు చాలండీ. నా గురించి టెన్షన్ పడొద్దు’ అని ఆయన అన్నప్పుడు కళ్ల నుంచి నీళ్లొచ్చాయి. గొప్ప ప్రతిభ కాదు.. గొప్ప మనసు ఉండడం కూడా మనిషికి చాలా అవసరమని అప్పుడే తెలిసింది. మరోసారి కర్ణాటకలో షూట్ చేస్తున్నప్పుడు అభిమానులు ఆయన మీద పడిపోతుంటే నేను అడ్డుకున్నాను. దాంతో వారు నా మీద దాడికి ప్రయత్నించారు. అప్పుడు బాలు గారే వచ్చి అతి ప్రయాస మీద వాళ్లను ఆపారు.
సముద్రమే చిన్నబోయేలా..
మెరీనాబీచ్‌లో మంగళంపల్లి జీవితంలో చేసిన ఫస్ట్ యాడ్ అది.. ‘సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా’ అని ఆయన పాటలాగా పాడాలి. ఆయన పాడిన క్షణాల్లో సముద్ర హోరే నిశ్శబ్దమైపోయిందంటే నమ్మండి.
ఆనంద ఆనవాళ్లు
ఒకసారి షూటింగ్ వివరాలు తెలుసుకోవడానికి సినీ నటి శ్రీదేవి కాల్ చేశారు. అయితే నేను టెలికాలర్ అనుకొని విసుక్కున్నాను. తర్వాత ఆమె అని తెలిశాక భయపడ్డాను. అయితే దాన్ని ఆమె స్పోర్టివ్‌గా, జోవియల్‌గా తీసుకున్నారు.
ఆర్‌ఎస్ బ్రదర్స్ కోసం కేజీల్లో చీరలమ్మే కాన్సెప్ట్ డిజైన్ చేశాం. ఆ యాడ్‌కి టాప్ యాంకర్ సుమని అడిగాం. అయితే ఆమె విపరీతమైన బిజీ. అయినా ఒప్పించి కేవలం రెండు గంటలే సమయం తీసుకున్నాం. అనుకున్న టైమ్‌లో యాడ్ పూర్తి చేయడంతో సుమ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె మా సంస్థలో రెగ్యులర్‌గా చేస్తున్నారు.
క్రేన్ వక్కపొడి 60 ఏళ్ల వేడుక సందర్భంగా 60 ఏళ్లున్న అప్పటి, ఇప్పటి నటీనటులతో యాడ్ చేయాలని కష్టపడి ఎందరినో పట్టుకున్నాం. రావికొండలరావు, సత్యనారాయణ, చంద్రమోహన్, అన్నపూర్ణ... ఇలా 100 మంది ఆర్టిస్టులతో షూట్ చేశాం. సారథి స్టూడియోలో అది ఒక పండగలా జరిగింది.
ఒక యాడ్ షూట్ కోసం సిరివెన్నెల కుటుంబంతో రుషికేష్‌లో వారం రోజులు గడపడం.. మర్చిపోలేని అనుభూతి. ఆయన కవితలు, పాటలు వినిపిస్తుంటే జీవితానికి ఇంతకు మించి దక్కే వరం ఏముంటుంది?
కష్టం.. నష్టం
చెన్నైలో కాజల్ అగర్వాల్ ఆర్టిస్టుగా షూటింగ్. రేపు షూట్ అనగా సాయంత్రం 6 గంటలకు లైట్‌మెన్లు మెరుపు సమ్మె ప్రకటించారు. ఎంతో బతిమిలాడితే అనుమతిచ్చి ఉదయాన్నే అడ్డుకున్నారు. దీంతో చాలా నష్టం వచ్చింది. అయితే కాజల్, ఆమె తండ్రి షూటింగ్ హైదరాబాద్‌లో కంటిన్యూ చేద్దామని మద్దతివ్వడం చాలా ఆనందాన్నిచ్చింది.