నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
నిత్యపెళ్లికొడుకు
జూబ్లీహిల్స్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్ధుడు మూడు నెలలు తిరగకుండానే నాల్గవ భార్యను వదిలి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.... టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ సయీద్(19) వివాహం గతేడాది నవంబర్ 13న సయ్యద్ యాసర్ అహ్మద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే ఆమెను అత్తగారు వేధించడం మొదలుపెట్టింది. దీంతో సిమ్రాన్ వేరు కాపురం పెట్టింది. అయినాసరే అత్త వేధింపులు ఆపకపోవడంతో వేరుకాపురం మానేసి సొంతింటికి తీసుకొచ్చింది. తన భర్త ఆభరణాల వ్యాపారి అని పెళ్లికి ముందు నమ్మించారని, తీరా చూస్తే ఏమి చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో పలుమార్లు గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే సిమ్రాన్‌ను ఆమె అత్త గదిలో వేసి తాళం వేసి తీవ్రం గా కొట్టేది. ఈ ఏడాది జనవరి 19న ఆమెకు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కుటుంబ సభ్యులను పిలిపించి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో సిమ్రాన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం భర్తతో పాటు అత్త, ఆమె కుటుంబ సభ్యులు పరారయ్యారు. తనను నాల్గవ వివాహం చేసుకొని మూడు నెలలు తిరగకుండానే మోసం చేసి పరారైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.