పంచ్ తంత్రం | story of punch | Sakshi
Sakshi News home page

పంచ్ తంత్రం

Published Sat, Jan 24 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

పంచ్ తంత్రం

పంచ్ తంత్రం

త్రేతాయుగంలో వానరయోధులు మార్షల్‌ఆర్ట్స్‌లో మహామహులే. ముష్టిఘాతాలతో రావణసేనకు ముచ్చెమటలు పట్టించిన వారే. యుగాల ప్రవాహంలో ఈ యుద్ధకళ.. సరికొత్త హంగులను అందిపుచ్చుకుని ఆత్మరక్షణ మంత్రంగా ఉన్న ఈ కళగానే కాదు  ఆత్మవిశ్వాసం అందించే ‘పంచ్’తంత్రంగా మారింది. అందుకే ఈ కరాటే క్లాస్‌లకు అబ్బాయిలు, అమ్మాయిలు క్యూ కడుతున్నారు. కుంగ్‌ఫూతో అదరగొడుతున్న పిల్లలను సిటీప్లస్ తరఫున సినీ నటుడు సుమన్ పలకరించారు.

 సుమన్: మార్షల్ ఆర్ట్స్ ద్వారానే నేను సినిమాల్లోకి వచ్చాను. ఈ రోజుకీ నేను ఫిట్‌గా ఉండగల్గుతున్నానంటే మార్షల్ ఆర్ట్స్ వల్లే. ఈ కళ గురించి, దాని ప్రాధాన్యం గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉంది..! చెప్పండి కరాటే టీమ్‌తో ఉన్నట్టున్నారు?
ప్రశాంత్: అవును సార్. డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో మాస్టర్‌గా చేస్తున్నాను. మాలాంటి వారికి ఇన్‌స్పిరేషన్ మీరే. 12 ఏళ్లప్పటి నుంచే కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టాను. గ్రాండ్ మాస్టర్ సత్యశంకర్ గారి స్టూడెంట్‌ని. టెన్త్‌లో ఉండగా బ్లాక్‌బెల్ట్ సాధించాను. కరాటే మాస్టర్‌గా జీవనం సాగిస్తున్నాను.
సుమన్: గుడ్. మీరు చెప్పండి, మీతో ఉన్న వారంతా కుంగ్‌ఫూ టీమ్‌లా ఉంది?
కల్యాణ్: అవునండి. కె.కె మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాను. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మా గురువుగారు నాకు ఉచితంగా నేర్పించారు. ఇప్పుడు నేను కూడా అనాథ బాలికలకు ఉచితంగానే నేర్పిస్తున్నాను.
 సుమన్: గుడ్. ఇక్కడ సీనియర్ స్టూడెంట్ ఎవరు?
 నేనే సార్ అంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు
 సుమన్: నీ పేరు?
 స్టూడెంట్: మీ పేరే సార్.. సుమన్.
 సుమన్: ఓ (నవ్వుతూ...) ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు?
 సుమన్ (స్టూడెంట్): నాలుగేళ్ల నుంచి కుంగ్‌ఫూలో శిక్షణ తీసుకుంటున్నాను.
 సుమన్: ఇది నేర్చుకోవడం వల్ల నువ్వు పొందిన లాభం ఏంటి?
 సుమన్ (స్టూడెంట్): ధైర్యం పెరిగింది. చదువులో కూడా స్ట్రెస్ అనే మాట లేదు సార్.
 సుమన్: వెరీ గుడ్. గర్ల్స్‌లో సీనియర్ ఎవరిక్కడ?
 షిఫా: నేను సార్. రెండేళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. మా మాస్టర్ మాకు రెగ్యులర్ క్లాసులతో పాటు ప్రత్యేకంగా సెల్ఫ్‌డిఫెన్స్ క్లాసులు చెబుతారు.
 సుమన్: అవును. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. కుంగ్‌ఫూతో మీరే ఆయుధంగా మారొచ్చు. నువ్వు కరాటే నేర్చుకుంటానంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా?
 షిఫా: వెంటనే ఒప్పుకున్నారు సార్. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటానికి మార్షల్‌ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది.
 సుమన్: పిల్లలకు చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ ముఖ్యమని గమనించి ప్రోత్సహిస్తున్న పేరెంట్స్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నీ గురించి చెప్పమ్మా..?
 మధుస్మిత: నేను ఆర్ఫన్‌ని సార్. బాలసదన్‌లో ఉంటాను. అక్కడ మా బాగోగులు చూసే లక్ష్మీకుమారి మేడమ్ ప్రోత్సాహంతో ఓ పది మంది అమ్మాయిలం కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నాం.
 సుమన్: నువ్వు నేర్చుకున్న ఈ విద్య.. నిజజీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడిందా..?
 మధుస్మిత: అవును సార్. ఒకసారి నేను స్కూల్ నుంచి వస్తుంటే ఒకబ్బాయి వెనుకే నడుస్తూ కామెంట్ చేశాడు. మాటిమాటికీ రిపీట్ చేయడంతో నా స్టంట్స్ చూపించాను. అంతే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
 సుమన్: వెరీ గుడ్ ఆకతాయిల ఆటకట్టించేలా అమ్మాయిలంతా తయారవ్వాలి. కరాటే నేర్చుకుంటే పిల్లలకు దెబ్బలు తగులుతాయని, చదువు దెబ్బతింటుందని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మనం ఎలా నడవాలో దగ్గర్నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వరకూ అన్నింట్లో మార్షల్ ఆర్ట్స్ ప్రభావం కనిపిస్తుంది. అందుకే చాలా దేశాలు దీన్ని పాఠ్యాంశాల్లో భాగం చేశాయి.
 షిఫా: యస్ సార్. నేను ర్యాంక్ స్టూడెంట్‌ని.
 సుమన్: విన్నారుగా మార్షల్ ఆర్ట్ చదువును పెంచుతుంది తప్ప, అడ్డుపడదు.
 మౌనిక: అవును సార్. దీనివల్ల లేజీనెస్ దూరమవుతుంది.
 సుమన్: ఆలోచనా శక్తి పెరగడంతోపాటు కోపం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ అలవడుతుంది.
 ప్రశాంత్ : శరీరానికి బోలెడంత ఎక్సర్‌సైజ్ అవుతుంది. చూస్తూనే ఉన్నాం కదా సార్. చాలా మంది పిల్లలు ఒబేసిటీతో బాధపడుతున్నారు.
 సుమన్: దీనికి అసలు కారణం.. స్కూళ్లలో ఆటలకు టైమ్ కేటాయించకపోవడమే. పాఠశాలలకు ఆటస్థలమే ఉండటం లేదు. అపార్ట్‌మెంట్లలో చదువు నేర్పడం కన్నా దురదృష్టం మరొకటి లేదు. దీంతో పిల్లలకు శారీరక శ్రమ లేకుండా పోతోంది. పిల్లలు నిండు ఆరోగ్యంతో, చలాకీగా ఉండాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే సరి. ఈ తరం తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి. విదేశాల్లో ఇదే పని చేస్తున్నారు.
 ప్రశాంత్ మాస్టర్: మన దేశంలో పేరెంట్స్ ఈ దిశగా ఆలోచించకపోవడం దురదృష్టకరం.
 కల్యాణ్: పాఠశాలల్లో పీటీ సార్‌ను పెట్టినట్టు, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌నీ పెడితే బాగుంటుంది సార్.
 ప్రశాంత్: చాలామంది మాస్టర్లు అవకాశాలు లేక బాడీగార్డుల్లా పని చేసుకుంటున్నారు.
 కల్యాణ్: సార్.. మిమ్మల్ని
 ఒక ప్రశ్న అడగాలి?
 సుమన్: అడగండి..
 కల్యాణ్: మీరు కరాటే ఎందుకు నేర్చుకున్నారు? ఎవరు ప్రోత్సహించారు?
 సుమన్: నేను ఆరో తరగతిలో ఉండగా నా ఫ్రెండ్ ఒకతను కరాటే నేర్చుకున్నాడు. నాకు బాగా నచ్చి అమ్మానాన్నని అడిగాను. వాళ్లు ఓకే అన్నారు. ఇది 70లో ముచ్చట. అప్పటికి మార్షల్ ఆర్ట్స్ గురించి ఎవరికీ అంతగా అవగాహన లేదు. ముందు నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. నేను ఎనిమిదో క్లాస్‌లో ఉండగా, మా ఇంటి దగ్గరే డోజో ఓపెన్ అయింది. అందులో చేరిపోయాను. కాలేజీ రోజుల్లో కూడా చాలా కాంపిటేషన్స్‌లో పాల్గొన్నాను. అప్పటికే నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది.
 ప్రశాంత్: ముప్పై ఏళ్ల నుంచి ఇప్పటి దాకా యూత్‌కు మీరే ఇన్‌స్పిరేషన్ సార్.
 సుమన్: నాకూ ఈ ఆర్ట్‌పై అభిమానం ఎక్కువ. మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్‌కు తరచుగా వెళ్తుంటాను. ఈ రోజు సాక్షి స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని పలకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా పేరెంట్స్‌కు చెప్పేదొకటే. మీ పిల్లలకు కరాటే నేర్పించి వారి జీవితానికి దృఢమైన బాట వేయండి. థాంక్యూ..
 
 సుమన్: నువ్వు చెప్పమ్మా కరాటే ఎందుకు నేర్చుకున్నావు ?
 అఖిల: కాన్ఫిడెన్స్ కోసం సార్.
 సుమన్: ఎవరైనా దొంగ నీ చైన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తే సమాధానం చెప్పగలవా ?
 అఖిల: ఒక్కరు కాదు.. నలుగురు వచ్చినా బుద్ధి చెప్పగలను.
 సుమన్: గుడ్...ఏదీ ఒక్కసారి రఫ్ ఫైట్ చూపించు.
 ఫైట్ ముగిసాక..
 సుమన్: వెరీ నైస్. చెప్పు బాబు నువ్వు ఏం నేర్చుకుంటున్నవ్ ?
 ఏం చదువుతున్నావ్?
 అర్జున్: కుంగ్‌ఫూ. ఎల్‌కేజీ చదువుతున్నాను.
 సుమన్: ఎందుకు నేర్చుకుంటున్నావ్?
 అర్జున్: అమ్మ నేర్చుకోమంది.
 సుమన్: నాకు ఏం చేసి చూపిస్తావ్?
 అర్జున్: కటా
 సుమన్: ఏదీ చెయ్..
 అర్జున్ కటా ప్రదర్శన తర్వాత...
 సుమన్: గుడ్..సూపర్..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement