సూపర్ వరి
- పౌష్టికాహార లోపానికి ధాన్ 45తో చెక్
- జింక్ అధికంగా ఉండే వరి వంగడం సృష్టి
- మన శాస్త్రవేత్తల ఘనత
- ఏపీతో సహా ఐదు రాష్ట్రాలకు సిఫార్సు
సాక్షి, హైదారాబాద్: భారతదేశంలోని ప్రజల్లో పౌష్టికాహార లోపానికి చెక్ పెట్టేందుకు మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన వరి వంగడాన్ని సృష్టించారు. జింక్ ఎక్కువగా ఉండే ఈ కొత్త వంగడానికి ధాన్ 45 అనే పేరు పెట్టారు. ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహారం ద్వారానే పోషకాహార లోపాలను నివారించే లక్ష్యంతో ఈ వరిని అభివృద్ధి చేశారు. దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 70 శాతం మంది పోషకాహారం లేక వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారని పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు పలు సూచనలు కూడా చేసింది. ఇందులో ప్రధానమైంది పౌష్టికాహార లోపాన్ని అధిగమించే వంగడాలను కనిపెట్టడం. పార్లమెంటరీ కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (గతంలో వరి పరిశోధన సంస్థ) కొంతకాలంగా వివిధ రకాల ప్రయోగాలు చేసి కొన్ని వంగడాలను తెరపైకి తీసుకువచ్చింది.
ధాన్ 45తో ఏంటి లాభం?
పౌష్టికాహార లోపంతో భారతదేశంలో నిత్యం 3 వేల మంది మరణిస్తున్నారు. సుమారు 20 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. వీరిలో అత్యధికులు బాలలు, మహిళలే. భారత్‌లో ప్రధానంగా బీహార్‌లో 50 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 37 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 36, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో 32 శాతం చొప్పున బాలలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఎదిగే పిల్లల్లో జింక్ ధాతు లోపం ఏర్పడితే ఎదుగుదలకు ఇబ్బందులు వస్తాయి, రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. మన శరీరంలోని దాదాపు 300లకు పైగా ఎంజైమ్స్ సక్రమంగా పనిచేయాలంటే జింక్ అవసరం. 60, 70 కిలోల బరువున్న వారికి కనీసం రెండు మూడు గ్రాముల జింక్ కావాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, వరిగ వంటి చిరు ధాన్యాల వంటి వాటితో శరీరానికి కావాల్సిన పోషకాలను పొందవచ్చు.
అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో వీటి వినియోగం తగ్గిపోయింది. అందువల్లే పోషకాల్లో ముఖ్యమైన జింక్ అధికంగా ఉండే వరిని వ్యవసాయ పరిశోధన సంస్థ సృష్టించింది. దీనికోసం 12 ఏళ్లు నిర్విరామ కృషి చేసింది. కొత్త వంగడానికి డీఆర్‌ఆర్ ధాన్ 45 (ఐఇటీ 23832) అని నామకరణం చేసింది. 125 రోజుల్లో కోతకు వచ్చే ఈ కొత్త వరిలో అత్యధికంగా 22.6 పీపీఎం (ఇప్పటి వరకూ ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ) జింక్ ఉంటుంది. అంతేగాక ఎకరానికి ఐదు టన్నుల వరకు దిగుబడి కూడా ఇస్తుంది. రుచికరంగానూ ఉంటుంది. వరి పరిశోధన సంస్థ సాగుకు సిఫార్సు చేసిన ఐదు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఈ వంగడంతో పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
తిన్నా.. ‘తీరని ఆకలి’
బియ్యాన్ని పాలిష్ పట్టడం వల్ల గింజపై ఉండే పల్చటి పొర(అల్యూరోన్ లేయర్) పోతుంది. వాస్తవానికిదే ఈ పొరలోనే కొన్ని రకాల విటమిన్లు, ఐరన్, జింక్ తదితర పోషకాలు ఉంటాయి. ఈ సూక్ష్మపోషకాలు లేని బియ్యాన్ని వండుకుని తిన్నా.. కడుపు నిండుతుంది తప్ప శరీరంలో నిజమైన ‘ఆకలి తీరదు’. శాస్త్రీయ పరిభాషలో దీన్ని ‘హిడెన్ హంగర్’ అంటారు. ఈ తీరని ఆకలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురి బాలల్లో ఒకరు సతమతమవుతున్నారు. ఫలితంగా వారి శరీర ఎదుగుదల ఆగిపోతోంది. ఈ సమస్యకు ధాన్ 45 పరిష్కారంగా భావిస్తున్నారు.