ఇది ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనికాదు
ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడం పూర్తిగా కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని ప్రముఖ న్యాయవాది రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తీర్పు వచ్చేముందే సుప్రీంకోర్టు అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఇది చట్టానికి, న్యాయానికి విరుద్ధమైన పని అని, కోర్టు ఆమెను లోపలకు అనుమతించాలని చెప్పినప్పుడు గౌరవించాలని అన్నారు. కానీ దాన్ని స్వీకరించకుండా లోపలకు ఆమెను అనుమతించేది లేదంటే.. అది న్యాయాన్ని గౌరవించే ప్రజాప్రతినిధి చేయాల్సిన పని కాదని, చట్టం గురించి ఏమాత్రం తెలియనివాళ్లు, సామాన్యులు చేశారంటే పోనీలే పాపం అనుకోవచ్చని ఆయన చెప్పారు.
నిజానికి ప్రజాప్రతినిధులను చూసి రాబోయే తరాలు నేర్చుకునేలా ఉండాలని, అంతే తప్ప వాళ్లకు వాళ్లే నిర్దేశించుకోవడం కుదరదని అన్నారు. తీర్పు వారికి నచ్చకపోతే అప్పీలు చేసుకోవచ్చు గానీ ఇలా ప్రవర్తించకూడదని తెలిపారు. ఇది మొదటిసారి కాదని, ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. శాసనసభ చేసిన చట్టాలను కూడా న్యాయవ్యవస్థ సమీక్షించవచ్చని, దాన్ని శాసన సంస్థలు కాదనడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.