
నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకోండి..
- నకిలీ పత్రాల ఆధారంగా ఎన్‌ఓసీ ఇచ్చిన కమిటీలోని ఇతరులపై కూడా...
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాల ఆధారంగా ఓ భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ దుర్గాప్రసాద్, మాజీ తహసీల్దార్ వెంకటరెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ పి.మధుసూదన్‌రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పత్రాలు, ఇతర రికార్డు లను పరిశీలించకుండానే నవీన్ మిట్టల్ నేతృత్వంలోని కమిటీ ఎన్‌ఓసీ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. వీరంతా రూ.25వేలను బాధిత వ్యక్తికి ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. నకిలీ పత్రాలు సృష్టించి ఎన్‌ఓసీ పొందిన మహ్మద్ రుక్ముద్దీన్, మహ్మద్ అబ్దుల్, సయ్యద్ అబ్దుల్ రబ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా న్ని ఆదేశించింది.
వీరు కూడా బాధిత వ్యక్తికి రూ.25వేలను ఖర్చుల కింద చెల్లించాలంది. నవీన్ మిట్టల్ నేతృత్వంలోని కమిటీ జారీ చేసిన ఎన్‌ఓసీ చెల్లదంటూ, దానిని రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరిం చారు. హైదరాబాద్, గుడిమల్కాపూర్‌లోని సర్వే నెంబర్ 284/6లో తాను 5,262 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానని, ఈ విషయం లో తన ప్రమేయం లేకుండానే అధికారులు ఎన్‌ఓసీ జారీ చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ శాంతి అగర్వాల్ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్‌ఓసీ జారీ చేసిన కమిటీ, అది పొందిన వ్యక్తు లపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ను కోరారు. ఎన్‌ఓసీ పొందిన వారి నుంచి భూమి కొనుగోలు చేసిన వారు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు... ఎన్‌వోసీల జారీ నిమిత్తం నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తేల్చారు. ప్రజాప్రయో జనాల నిమిత్తం ఎన్‌ఓసీ జారీ చేస్తున్నామని చెప్పిన కమిటీ, ఆ అంశాన్ని అస్సలు పట్టించు కోలేదన్నారు.