ఎంబీసీలను ప్రభుత్వం ఆదుకోవాలి: తమ్మినేని
హైదారాబాద్: రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్న ఎంబీసీ కులాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. పేరుకు బీసీలు అయినప్పటికీ వీరు సమాజంలో అత్యంత వివక్షను అనుభవిస్తున్నారని.. తమ మహాజన పాదయాత్ర సందర్భంగా ఎంబీసీల నుంచి అనేక వినతులు వస్తున్నాయని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఎంబీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు అందడం లేదని.. అలాగే ఇందులో మెజారిటీ కులాలకు చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం రాలేదని తెలిపారు. అణగదొక్క బడ్డ వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించాల్సిన అవసరముందన్నారు. ఫెడరేషన్ల ద్వారా ఇస్తున్న లోన్లు కూడా వీరికి సరిగా అందడం లేదన్నారు. మొత్తం 208 కోట్లు కేటాయిస్తే.. 20 కోట్ల రుణాలు కూడా వీరికి అందలేదని తెలిపారు.
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నవారు సైతం వీరిని ఎంబీసీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. వీరికి సామాజిక పరమైన రక్షణకోసం ఎస్సీ, ఎస్టీ తరహాలో అట్రాసిటీ చట్టం అవసరముందన్నారు. వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ను ఏర్పాటుచేసి.. దానికి 10 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రుణాలు అందించేందుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.