బతుకుదెరువు తెలంగాణ కావాలి
తమ్మినేని వీరభద్రం
ఇబ్రహీంపట్నంరూరల్/మహేశ్వరం: బంగారు తెలంగాణ కాదు.. బతుకుదెరువు ఉన్న తెలంగాణ కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్, ఎంపీ పటేల్‌గూడ, కొంగర కలాన్ గ్రామాల్లో పూర్తి చేసుకొని, మహేశ్వరం మండలం రావిర్యాల, తుక్కుగూడ గ్రామాల్లో ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీలు బాగుపడకుండా రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఏమాత్రం అందడం లేదని, గ్రామీణ ప్రజలు టీఆర్‌ఎస్ పాలన, కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు విద్య, ఉపాధి వస్తుందని కలలు కంటే అవి కలలుగానే మిగిలిపోయాయన్నారు. కొంగర కలాన్, అదిభట్ల గ్రామాల్లో ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం వందలాది ఎకరాల భూములను కారుచౌకగా తీసుకుందని, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు.
కొంగరకలాన్‌లో రైస్‌హబ్‌కు బదులు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట కాలువలు, కట్టలను కబ్జా చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడన్నారు. మహేశ్వరం మండలంలోకి ప్రవేశించిన పాదయాత్రకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో ప్రజావేదిక కన్వీనర్ చంద్రకుమార్, లంబడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.