మాయదారి! | Tank area was home to the accidents | Sakshi
Sakshi News home page

మాయదారి!

Published Wed, Feb 15 2017 11:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మాయదారి! - Sakshi

మాయదారి!

హైదరాబాద్‌ పేరు చెప్పగానే చార్మినార్‌ తర్వాత గుర్తుకువచ్చేది ట్యాంక్‌బండ్‌.

సిటీబ్యూరో : హైదరాబాద్‌ పేరు చెప్పగానే చార్మినార్‌ తర్వాత గుర్తుకువచ్చేది ట్యాంక్‌బండ్‌. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉండే ఈ ప్రాంతం ప్రమాదాలకూ నిలయంగా మారింది. గత ఏడాది మొత్తం 24 యాక్సిడెంట్స్‌ చోటు చేసుకోగా... నలుగురు మరణించారు. సిటీ ట్రాఫిక్‌ పోలీసులు రూపొందించిన బ్లాక్‌ స్పాట్స్‌ జాబితాలో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. నాలుగేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన ‘30 కేఎంపీహెచ్‌’ నిబంధన సైతం ఫలితాలు ఇవ్వట్లేదు. ఉల్లంఘనులకు ఈ–చలాన్‌ జారీ చేయడం మినహా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.

ఒకే ‘బండ’పై మూడు ప్రాంతాలు...
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు గత ఏడాది గణాంకాలు ఆధారంగా సిటీలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల జాబితాను రూపొందించారు. నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాల పరిధిలో మొత్తం 85 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు తేలింది. వీటన్నింటిలోనూ ట్యాంక్‌బండ్‌ ప్ర«థమ స్థానంలో నిలిచింది. 2.6 కిలోమీటర్లు పొడవు ఉన్న దీనిపై మూడు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. లేపాక్షి, రామదాసు విగ్రహం, వీరేశలింగం విగ్రహాలకు అటు ఇటు 300 మీటర్ల పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు స్పష్టమైంది. మొత్తం ట్యాంక్‌బండ్‌లో దాదాపు మూడో వంతు ప్రమాదాలకు నిలయంగా మారింది.

లోకాయుక్త ఆదేశించినప్పటికీ...
ట్యాంక్‌బండ్‌పై నాలుగేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఘోర ప్రమాదం లోకాయుక్తనే కదిలించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన సైకిల్‌షాపు యజమాని ప్రవీర్‌ సమ్‌హమ్, భార్య మాలా సమ్‌హమ్‌ కుమార్తెలు రాకా సోమ్, రుత్వికలతో కలిసి 2012 అక్టోబర్‌ 24న నగరానికి వచ్చారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న భారత్‌ సేవాశ్రమంలో బస చేసిన వీరు అదే నెల 27వ రాత్రి 9 గంటల ప్రాంతంలో ట్యాంక్‌బండ్‌ పైకి వచ్చారు. లేపాక్షి సమీపంలో వీరు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన నిజమాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మాలా అక్కడికక్కడే మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రవీర్‌ చనిపోయారు. రాఖీకి తీవ్రగాయాలు కాగా... రుత్విక స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన లోకాయుక్త జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ప్రమాదాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

‘30’తో చేతులు దులుపుకున్న అధికారులు...
లోకాయుక్త ఆదేశాలతో కదిలిన యంత్రాంగాలు గంటకు 30 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళకూడదంటూ ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నాయి. ఈ ప్రాంతంలో అప్పటికే గంటకు 40 కిలోమీటర్ల మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంది. దీన్ని పట్టించుకోని యంత్రాంగాలు..నామ్‌కే వాస్తేగా ‘30’ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అమలులో ఉంటుందనేది స్పష్టం చేయలేదు.

ట్యాంక్‌బండ్‌పై ప్రస్తుతం ఉన్న సమస్యలు...
ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా పాదచారులతో పాటు వాహనచోదకులూ బాధితులుగా మారుతున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. పాదచారులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం, రోడ్డు దాటే సౌకర్యాలు కల్పించకపోవడం, వాహనాలను నియంత్రించే డివైడర్‌ కరవు కావడం, సరైన పార్కింగ్‌ వసతులు లేకపోవడం. ఓ పక్క మాత్రమే వాహనాలు ఆపుకోవడానికి అవకాశం ఉండటంతో అక్కడ వాటిని నిలిపిన వారు భారీ ట్రాఫిక్‌లోనూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ ప్రమాదాల్ని కొంత వరకు తగ్గించడానికి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఎఫ్‌ఓబీ) నిర్మాణం ఓ మార్గమని అధికారులు భావిస్తున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌పై ఉన్న పరిస్థితులు దీని నిర్మాణానికి ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడున్న స్ట్రక్చర్‌ ఎఫ్‌ఓబీ ఏర్పాటుకు సహకరించదు. దీని ఏర్పాటు వల్ల ఏటా జరిగే గణేష్‌ నిమజ్జనం సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎఫ్‌ఓబీ వల్ల భద్రతా సమస్యలు రావడంతో పాటు సరైన నిఘా లేకుంటే అంది అసాంఘికశక్తులకు అడ్డాగా మారి నేరాలకు నెలవు కావచ్చు.

‘ఆ ఉల్లంఘనుల’ మాటేమిటి?
పరిమితికి మించిన వేగంతో వెళ్తూ ‘చిక్కిన’ వాహనాలను గుర్తించి చలాన్‌ వేసే అధికారం పోలీసులకు ఉంది. దీంతో ఆ ప్రాంతంలో నిత్యం స్పీడ్‌ లేజర్‌ గన్స్‌తో తనిఖీలు చేపడుతున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్ళే వాహనాల ఫొటోలు తీసి ఈ–చలాన్లు ఇంటికి పంపిస్తున్నారు. అయితే ఇది సమస్యకు పరిష్కారం కానేకాదు. మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనచోదకుడికి ఆ చలాన్‌ అందే లోపే ప్రమాదం జరుగవచ్చు. లేదా ఎదుటి వారిని అతడు ఢీ కొట్టే ప్రమాదమూ లేకపోలేదు. మరోపక్క ఇక్కడ సమస్య పాదచారులకు సంబంధించింది. నిర్దేశించిన ప్రాంతంలో తప్ప ఎక్కడికక్కడ రోడ్డు దాటే పాదచారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. తాజాగా వీరికోసం మూడుచోట్ల జీబ్రా క్రాసింగ్‌ పెట్టారు. 2.6 కిలోమీటర్ల పొడవున్న ట్యాంక్‌బండ్‌పై ఎక్కిన వారికి ఆ మూడూ ఫలానాచోటా ఉన్నాయని వీరికి తెలియడం కష్టం.

ఇలా ఎందుకు చేయరు?
ఈ చర్యల ప్రధాన ఉద్దేశం పాదచారుల్ని కాపాడటం. దీనికి ట్రాఫిక్‌ పోలీసులు ఒక్కరు పూనుకున్నంత మాత్రాన ఫలితాలు ఉండవు. జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం ముందుకు వచ్చి సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాంక్‌బండ్‌పైకి ఎక్కిన పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా ఆద్యంతం తాత్కాలిక రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి.మొత్తమ్మీద రెండు లేదా మూడు చోట్ల రోడ్డు క్రాసింగ్‌కు అవకాశం ఇవ్వాలి. ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా, ఈ క్రాసింగ్‌లకు ఇరువైపులా 300 మీటర్ల దూరంలో బోర్డులు ఏర్పాటు చేయాలి. అంతా ఈ ప్రాంతాల నుంచే క్రాస్‌ చేయాలి కాబట్టి ఇవి కచ్చితంగా అతిపెద్ద జీబ్రాక్రాసింగ్‌ అయి ఉండాలి. కనిష్టంగా 4 మీటర్ల వెడల్పు ఉండాలి.
     
దీనికి అటు ఇటు పెడస్ట్రియన్‌ క్రాసింగ్‌ ఎహెడ్‌ అనే గ్లోసైన్‌ బోర్డులు కానీ, పెడస్ట్రియ్‌ బ్లింకర్‌ లైట్లు కానీ, అనువైన పెడస్ట్రియన్‌ సిగ్నల్‌ కానీ ఏర్పాటు చేయాలి. ఈ క్రాసింగ్స్‌ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వేగ పరిమితిని అమలు చేయాలి.  దీని కోసం అక్కడి నలుగురైదుగురు సిబ్బందిని మోహరించాలి.  ట్యాంక్‌బండ్‌కు రెండు చివరలా... మధ్యలో అనువైన చోట్ల, క్రాసింగ్స్‌ ఏర్పాటు చేసిన చోట్ల రంబ్లర్‌ స్ట్రిప్స్‌గా పిలిచే వాటిని కనిష్టంగా మూడు మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తే వాహనాల వేగం దానంతట అదే తగ్గుతుంది. యాక్సిడెంట్‌ జోన్‌ను నిర్దేశిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం, సెయిలింగ్‌ క్లబ్‌ మధ్యలో 20 చోట్ల సూచికలు, మూడు చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్స్, లైనింగ్స్‌ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. 2012లో లోకాయుక్త సైతం ఇదే విషయం స్పష్టం చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement