
'టీడీపీ గెలిచింది సొంత ఓట్లతో కాదు'
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగడమేనా ప్రజాస్వామ్యమంటే...
- సీఎం, టీడీపీ మంత్రులపై ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగడమేనా ప్రజాస్వామ్యమంటే... అని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఏకపక్షంగా అప్రజాస్వామిక పోకడలతో రాజ్యమేలుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలకు ఏ మాత్రం సబంధం లేని సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుపకుండా టీడీపీ వారితో నామినేట్ చేసుకోవడం ప్రజాస్వామ్యమా.. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి జన్మభూమి కమిటీలతో పాలన సాగించడం ప్రజాస్వామికమా అని ధ్వజమెత్తారు.
ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యం చేయమేనా ప్రజాస్వామిక విధానాలంటే అని ఆయన విమర్శించారు. వాస్తవానికి టీడీపీ గెలిచింది సొంత ఓట్లతో కానే కాదని అందులో బీజేపీ ఓట్లు, మోసపూరితమైన హామీలతో వచ్చిన ఓట్లు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు పోయి గెలిచి చూపించండంటూ సవాలు విసిరారు. కాంగ్రెస్ హయాంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు సబ్సిడీ ఇచ్చేది లేదని చెప్పిన టీడీపీ ప్రభుత్వం సాగునీటి కాంట్రాక్టర్లకు మాత్రం పాత పనులకు కూడా పెంచిన రేట్లను ఇచ్చిందని ఆయన విమర్శించారు. ధాన్యం మద్దతు ధరలో పెంపుదల పెద్దగా లేక పోయినా వ్యవసాయమంత్రిగాని, ముఖ్యమంత్రి గాని మాట్లాడక పోవడం శోచనీయమని పేర్కొన్నారు.