శంషాబాద్: తిరుపతికి వెళ్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్‌జీ 1094 విమానాన్ని గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఉదయం 9.35 గంటలకు శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పది నిమిషాల వ్యవధిలోనే సమస్యను గుర్తించిన పైలట్ అప్రమత్తమై శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచనలతో 9.50 గంటలకు విమానాన్ని తిరిగి శంషాబాద్‌లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 170 మంది ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్యను సవరించిన అనంతరం 11.30 గంటలకు తిరుపతికి విమానం బయలుదేరింది.