జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం | Telangana Cabinet decisions | Sakshi
Sakshi News home page

జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం

Published Sat, Oct 22 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం

జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం

► బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు ప్రభావంపై అధ్యయనానికి కేబినెట్ నిర్ణయం
► హరీశ్‌రావు నేతృత్వంలో ఉప సంఘం ఏర్పాటు
► నెల రోజుల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు, రుణమాఫీ బకాయిల చెల్లింపు
► మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్‌కేర్ లీవ్
► స్కూల్ అసిస్టెంట్లుగా పీఈటీలు, భాషా పండితులు
► 6 కొత్త జిల్లాల పేర్లకు జిల్లా కేంద్రాల పేర్లు జోడింపు
► ఏపీకి అప్పగించిన భవనాలను తిరిగివ్వాలని కోరుతూ తీర్మానం.. గవర్నర్‌కు అభ్యర్థన

 
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా, కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ట్రిబ్యునల్ తీర్పుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తెలంగాణపై ప్రభావం, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని అధ్యయనం చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. ఏపీ వైఖరితో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేలా మన వ్యూహం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సబ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు.
 
శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ప్రధానంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు, కొత్త సచివాలయం నిర్మాణం, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్, భాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్, మిషన్ భగీరథ, కొత్త జిల్లాల పేర్లు, యూనివర్సిటీ విద్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ బకాయిలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు..
 
ఆ భవనాలు అప్పగించాలి
రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మాణం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీకి కేటాయించిన అసెంబ్లీ, కౌన్సిల్, సెక్రటేరియట్ భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8కు సంబంధించిన అంశం కావటంతో ఈ అభ్యర్థనను గవర్నర్‌కు పంపించనుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించుకునే వీలుంది. కానీ ఏపీ ప్రభుత్వం తమ రాజధాని అమరావతికి కార్యాలయాలను తరలించింది. దాంతో హైదరాబాద్‌లోని ఏపీ సీఎం కార్యాలయంతో పాటు మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేందుకు వాటన్నింటినీ అప్పగించాలని గవర్నర్‌ను అభ్యర్థిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రత్యామ్నాయంగా ఏపీ కార్యాలయాలు, పరిపాలనా వ్యవహారాల కోసం హైదరాబాద్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాలు సరిపోతాయని అంచనా వేశారు. నాంపల్లిలోని గృహకల్ప, మనోరంజన్ భవన్‌ను ఏపీకి అప్పగించాలనే యోచన ఉంది.
 
పలు అంశాలపై సబ్ కమిటీలు..
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు పునర్ వైభవం తీసుకురావాలని, ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ పరిపాలన, ప్రవేశాలు, విద్యా విషయక అంశాలు, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించనుంది. అన్ని యూనివర్సిటీలకు ఏకరూప విధానాన్ని అమలుచేసే అంశంపై అధ్యయనం చేసేందుకు డిప్యూటీ సీఎం కడియం ఆధ్యర్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ సభ్యులుగా ఉంటారు. ఇక ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులన్నీ జలకళ సంతరించుకుని.. చేపల పెంపకానికి అనుకూలంగా మారాయి. దీంతో ఇప్పటికే రూ.45 కోట్ల విలువైన చేప విత్తనాన్ని ప్రభుత్వం సరఫరా చేసింది. ఎన్‌సీడీసీ నిధులతో గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు చేపలు, గొర్రెలు, మేకల పెంపకానికి అనుసరించాల్సిన చర్యలను అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ సభ్యులుగా సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
 
ఆరోగ్యశ్రీపైనా సబ్ కమిటీ
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిర్వహించే శస్త్రచికిత్సలు, ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేయటం లేదని, ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయని వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆపరేషన్లకు నిర్ణయించిన ప్యాకేజీ సొమ్మును సవరించాలని.. లేదా నిర్ణయించిన ఫీజులకు శస్త్రచిక్సితలు చేసే ఆస్పత్రులకే ఆరోగ్యశ్రీ అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పరిశీలన జరిపేందుకు మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్
మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేబినెట్ శుభవార్త ప్రకటించింది. వారికి 90 రోజుల సీసీఎల్ (చైల్డ్‌కేర్) సెలవులు ఇవ్వాలని తీర్మానించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రసూతి సెలవులతో పాటు కేంద్ర ప్రభుత్వం తరహాలో ఈ చైల్డ్‌కేర్ సెలవులు ఇస్తారు. తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎప్పుడైనా ఈ 90 రోజుల సెలవులు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఒక్కోసారి గరిష్టంగా 15 రోజులకు మించకుండా.. మొత్తంగా ఆరు దఫాలుగా మాత్రమే ఈ సెలవులను వాడుకునే వీలుంటుంది.
 
స్కూల్ అసిస్టెంట్లుగా పీఈటీలు, భాషా పండితులు
విద్యాశాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వారిని స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా చూడాలని ఆయా సంఘాల నుంచి వస్తున్న డిమాండ్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 3,534 పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 2,487 భాషా పండిత పోస్టులు, 1,047  పీఈటీ పోస్టులున్నాయి. ఇకపై భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా పరిగణించనుంది.
 
నెల రోజుల్లో బకాయిల చెల్లింపు
రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ వృద్ధికి తోడు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరిగినందున వాటిని చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని, విమర్శలకు తావివ్వకూడదని ముఖ్యమంత్రి సూచించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,060 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. అందులో ఇప్పటివరకు రూ.1,090 కోట్లు చెల్లించగా.. మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంది. ఇక మూడో విడత రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.2,020 కోట్లు విడుదల చేయగా.. మరో రూ.2,020 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో వీటన్నింటినీ చెల్లించాలని సీఎస్‌కు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది నాలుగో విడత రుణమాఫీని ఏకమొత్తంలో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించారు.
 
కొత్త జిల్లాల పేర్లపై స్పష్టత
కొత్తగా ఏర్పాటైన కొమురం భీం, యాదాద్రి, భద్రాద్రి, జోగులాంబ, రాజన్న, జయశంకర్ జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ జిల్లాల పేర్లలో జిల్లా కేంద్రాల పేర్లు కూడా చేర్చింది. ఇకపై కొమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలుగా పిలిచే సవరణకు ఆమోదం తెలిపింది. ఆయా జిల్లాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement