- రుణమాఫీ అర్హులెవరన్నది త్వరలో జీవో ఇస్తాం
- రైతు భరోసాపై అందరితోచర్చించాకే నిర్ణయం
- రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగాశ్రీధర్‌బాబు, పొంగులేటి
- ప్రభుత్వ అంశాలు వీరు మాత్రమే మీడియాకుచెప్తారు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం(జూన్21) కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘గత ప్రభుత్వం రెండో టర్ములో డిసెంబర్ 11,2018 వరకు కటాఫ్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆమరుసటి రోజు డిసెంబర్ 12,2018 నుంచి డిసెంబర్ 9,2023వరకు 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఈ రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.
వ్యవసాయం దండగ కాదు..వ్యవసాయం పండుగ అని నిరూపించాలనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదా పద్ధతుల్లో చేసి రైతు ఆత్మహత్యలకు కారణమయింది. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రైతు భరోసాపై పారదర్శకంగా అందరి సూచనల మేరకే అమలు చేస్తాం.
ప్రభుత్వ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించాం. ఉపసంఘంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఇక నుంచి మీడియాకు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే చెప్తారు. వీరిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారం. వీరిని మంత్రివర్గ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నాం. రుణమాఫీ అర్హుల ఎంపిక విధివిధాలపై త్వరలోనే జీవో విడుదలవుతుంది’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment