సీఎం మొక్కులు: 3 కోట్లతో 'భద్రకాళి'కి స్వర్ణ కిరీటం
హైదరాబాద్ : వరంగల్లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు. రూ.3కోట్లతో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహుకరించనున్నారు. ఇటీవలే అందుకు సంబంధించి బంగారు కిరీటం కోసం కొలతలు తీసుకొని అంచనాలు తయారు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.
అలాగే వరంగల్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు,తిరుమల వెంకన్న, విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవార్లకు ముక్కుపుడకలు రాష్ట్ర ప్రభుత్వం చేయించనుంది. వీటికోసం దేవాదాయశాఖ నిధులను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నగలను సిద్ధం చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని.. దాదాపు రెండు కిలోల బరువుతో వజ్రవైఢూర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. దీనికి దాదాపు రూ.5.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు.