భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు
సాక్షి, హైదరాబాద్: భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని సీఎం పరిశీలించారు. 11 కిలోల 700 గ్రాముల బంగారంతో జీఆర్‌టీ జువెల్లర్స్ ఈ కిరీటం తయారు చేశారు. రూ.3.70 కోట్ల విలువైన ఈ కిరీటాన్ని ఆదివారం ముఖ్యమంత్రి సతీ సమేతంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తారు. శనివారం రాత్రికే సీఎం వరంగల్‌కు వెళ్లేలా ప్రణాళిక ఖరారైంది. కిరీటాన్ని పరిశీలించిన వారిలో సీఎం సతీమణి శోభ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ముఖ్యమంత్రి సలహాదారు కేవీ రమణాచారి తదితరులు ఉన్నారు.