కన్హయ్యను అరెస్ట్ చేయొద్దని చెప్పా: కేసీఆర్
హైదరాబాద్ : హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన బాధ కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. హెచ్సీయూ, ఓయూ ఘటనలపై శనివారం మధ్యాహ్నం ఆయన తెలంగాణ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రోహిత్ దళితుడా కాదా అన్నది ప్రశ్నకాదని అన్నారు. వర్శిటీలు కక్షలు, కార్పణ్యాలకు వేదిక కాకూడదని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వివక్షకు వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని ఆయన సూచించారు. హెచ్సీయూలో వాటర్, కరెంట్ సరఫరా నిలిపివేసి, విద్యార్థుల మెస్లు మూసివేయటం సరికాదన్నారు.
ఇక జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ పర్యటనను అడ్డుకోవద్దని తానే స్వయంగా డీజీపీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని అరెస్ట్ చేయవద్దని తానే చెప్పానన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ భావాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అందుకనే హెచ్‌సీయూ వద్ద కన్నయ్యను పోలీసులు అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
అయితే హెచ్సీయూ భద్రతా సిబ్బది కూడా ఖాకీ డ్రస్ వేసుకుంటారని చెప్పారు. కన్హయ్య కుమార్ను పోలీసులు యూనివర్సిటీలోకి అనుమతించినప్పటికీ వర్సిటీ సిబ్బంది అతడిని వీసీ అప్పారావు ఆదేశాల మేరకే అడ్డుకున్నారన్నారు. తర్వాత రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వాలని తాను చెప్పానని ఆ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొన్నారని, అక్కడ కూడా పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించలేదని కేసీఆర్ తెలిపారు.
ఇక వీసీ అప్పారావును రీకాల్ చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదన్నారు కేసీఆర్. హెచ్సీయూ భౌగోళికంగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ఆయన అన్నారు. హెచ్సీయూ ఘటనలపై తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు ఆయన సభలో హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే లాఠీఛార్జ్ ఘటనలో పోలీసుల అత్యుత్సహం ఉంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.
ఇక ఓయూలో వ్యక్తి ఆత్మహత్యపై కూడా కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే సంపత్ కుమార్పై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు. ఈ అంశాలపై సభ్యులు ఇచ్చిన సలహాలు,సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అనంతరం శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డారయి. కాగా ఈ నెల 31న తెలంగాణ అసెంబ్లీలో ఒకపూట విద్యపై సమగ్రంగా చర్చ జరగనుంది.