
తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహించనున్నారు. ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ రిజస్ట్రార్ యాదయ్యను నియమించారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది.
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసెట్ కన్వీనర్ ను మార్చాలని నిర్ణయించారు. మళ్లీ జేఎన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, పాత హాల్ టికెట్లతోనే పరీక్షకు అనుమతించాలని సీఎం సూచించారు. కొంత మంది చేసిన తప్పులకు వేలాది మందిని ఇబ్బంది పెట్టాల్సిరావడం బాధాకరమని, ఎంసెట్-3కి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు దర్యాప్తు చేసి లీక్కు కారకులైన వారిపై కేసు నమోదు చేసి కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి పేపర్ను కొనుగోలు చేశారు. ఉన్నతాధికారులో చర్చించిన అనంతరం ఎంసెట్-2ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా ఎంసెట్-3 పరీక్షకు షెడ్యూల్ విడుదల చేశారు.