ఎంసెట్-2 రద్దు చేశాం : హైకోర్టుకు ప్రభుత్వం నివేదన
దర్యాప్తును పర్యవేక్షించాలన్న పిటిషనర్.. తిరస్కరించిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. రద్దుకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నందున ఈ వ్యాజ్యంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. లీకేజీకి సంబంధించి సీఐడీ దర్యాప్తులో లోటుపాట్లు ఉన్నాయని పిటిషనర్ భావిస్తే.. కోర్టును ఆశ్రయించవచ్చని సూచి ంచింది. ఎంసెట్-2 రద్దుపై ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకమని ప్రకటిం చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.మహేందర్‌రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
కోర్టు పర్యవేక్షణ సాధ్యం కాదు..
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంసెట్-1లో నామమాత్రపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎంసెట్-2లో అసాధారణ ర్యాంకులు సాధించారని, ఇదంతా ప్రశ్నపత్నం లీకేజీ ద్వారానే సాధ్యమైనట్లు దర్యాప్తు సంస్థ తేల్చిందన్నారు. దీంతో మళ్లీ ఎంసెట్ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, సీఐడీ దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరారు. అయితే దర్యాప్తుపై తమ పర్యవేక్షణ సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అసాధారణ పరిస్థితుల్లోనే పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ వైఖరేమిటో తెలియచేయాలని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ జె.రామచంద్రరావులను అడిగింది. అందుకు ఏఏజీ బదులిస్తూ.. లీకేజీ వాస్తవమేనని, సీఐడీ దర్యాప్తు చేస్తోందన్నారు. బెంగళూరు, ముంబై, పుణె, కటక్, కోల్‌కతాలో విద్యార్థులకు ప్రశ్నపత్రాలిచ్చి వారికి శిక్షణను ఇచ్చారని వివరించారు. తర్వాత వారిని హైదరాబాద్ తీసుకొచ్చి ఎంసెట్-2 పరీక్ష రాయించారని చెప్పారు. పరీక్ష రద్దుపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రామచంద్రరావు కోర్టును కోరారు.
మా ఆదేశాలెందుకు..?
పరీక్ష రద్దు విషయంలో తమ నుంచి ఆదేశాలు కోరాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించింది. ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఆ తర్వాత ఏవైనా ఆదేశాలు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చని సూచించింది. పరీక్ష రద్దు నిర్ణయం పూర్తిగా పాలనాపరమైనదని తేల్చి చెప్పింది. కోర్టు హాల్లో కూర్చొని ప్రభుత్వాన్ని తాము నడపడం లేదని పేర్కొంది. ముందు నిర్ణయం తీసుకుంటే తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో చూస్తామంటూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఏఏజీ రామచంద్రరావు స్పందిస్తూ ఎంసెట్-2 రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తామని పేర్కొంది. ఇందుకు సత్యంరెడ్డి అంగీకరించడంతో ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ.. సీఐడీ దర్యాప్తులో లోటుపాట్లు ఉంటే కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.