ఆయకట్టు.. తీసికట్టు!
సాగునీటి ప్రాజెక్టుల కింద ఏటేటా గణనీయంగా తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం
► రాష్ట్రంలో ఏడు ప్రధాన ప్రాజెక్టుల కింద సాగు లక్ష్యం 21.32 లక్షల ఎకరాలు
► 2015-16లో సాగైంది కేవలం 71,477 ఎకరాల్లోనే..
► 2013-14లో 16.98 లక్షలు, 2014-15లో 7.90 లక్షల ఎకరాల్లో సాగు
► వర్షాభావానికితోడు పూడుకుపోతున్న కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు
► ఈ ఏడాది ప్రాజెక్టులు నిండినా ఆయకట్టు లక్ష్యాలు చేరుకోవడం కష్టమే
► సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైన సర్కారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం.. 21.32 లక్షల ఎకరాలు! ఇందులో గతేడాది సాగైంది ఎంతో తెలుసా? కేవలం 71 వేల ఎకరాలు!! ఈ లెక్కన కనీసం ఐదు శాతం ఆయకట్టు కూడా సాగు కాలేదన్నమాట! 2014-15లో 7.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2015-16 వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కేవలం 71 వేల ఎకరాలతో సరిపెట్టుకోవడం ప్రాజెక్టుల పరిధిలో సాగు దుస్థితికి అద్దం పడుతోంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితులకుతోడు ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రాకపోవడంతో ప్రాజెక్టుల కింద వ్యవసాయం ఏటేటా సంక్షోభంలో కూరుకుపోతోంది. నీళ్లు లేక ఆయకట్టు ప్రాంతాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తిగా ఖాళీ కావడంతో ఈ ఏడాది ఆయకట్టుపైనా అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ మంచి వర్షాలు కురిసి పూర్తిస్థాయిలో ప్రాజెక్టుల్లోకి నీరొచ్చినా.. అనుకున్న మేర ఆయకట్టు లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని ఆయక ట్టు అభివృద్ధి విభాగం(కాడా) తాజా నివేదిక తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల పరిధిలోని ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు పూడికతో నిండిపోవడంతోపాటు రైతుల నీటిని ఇష్టారీతిన వాడుకోవడం కూడా ఆయకట్టు లక్ష్యాలను దెబ్బతీస్తోందని కాడా తెలిపింది.
నీరులేక ఓ వైపు.. ఉన్నా ఇవ్వలేక మరోవైపు
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.32 లక్షల మేర ఆయకట్టు ఉంది. ఇందులో 2008-09 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ పూర్తి స్థాయిలో ఆయకట్టు లక్ష్యాలను చేరుకోలేదు. ఈ ఎనిమిదేళ్లలో అత్యధికంగా 2013-14 ఏడాదిలో 16.98 లక్షలు, 2010-11లో 16.36 లక్షల ఎకరాలకు నీరందించారు. 2008-09, 2012-13లో కృష్ణా, గోదావరి పరిధిలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండినా.. పూర్తిస్థాయి ఆయక ట్టుకు నీరందలేదు. ప్రాజెక్టుల్లోని ప్రధాన కాల్వల నిర్వహణ లోపాలు, అవన్నీ పూడికతో నిండిపోవడం, తొలి ఆయకట్టు రైతులు ఇష్టారీతిన నీటిని తోడేస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడం వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. కొన్నిచోట్ల కాల్వల లైనింగ్ లేక నీటి నష్టాలు పెరగడం, కాల్వల పరిధిలోని రైతులు గండ్లు కొట్టి నీటిని మళ్లించడం సైతం ఆయకట్టు లక్ష్యాలకు అడ్డంకిగా మారింది. నీరొచ్చిన సమయాల్లో ఆయకట్టు లక్ష్యాలు ఇలా దెబ్బతినగా.. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి.
వర్షభావం.. శరాఘాతం
2012-13 ఏడాదిలో కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో 916.8 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడం, ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీరు చేరడంతో 2013-14లో గరిష్టంగా 16.98 లక్షల ఎకరాలకు నీందించారు. 2013-14లో 1212.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం కూడా ఇందుకు దోహదం చేసింది. అయితే ఆ తర్వాత ఏడాది 2014-15లో వర్షపాతం 562.1 మిల్లీమీటర్లకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టుల్లో మిగిలిన కొద్దిపాటి నీళ్లతో 7.90 లక్షల ఎకరాలకు నీరందించగలిగారు. ఆ తర్వాత ఏడాదిలో ఎన్నడూ లేని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం, భూగర్భ జలాలు భారీగా క్షీణించడం, ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలోనూ కరువు ఏర్పడటంతో పరిస్థితులు దారుణంగా మారాయి. 2015-16లో 717.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినా ప్రాజెక్టుల్లోకి రావాల్సిన నీరు రాలేదు. దీంతో కేవలం కడెం, ఆర్డీఎస్, జూరాల పరిధిలో 71,477 ఎకరాలకు మాత్రమే నీరివ్వగలిగారు.
తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం
ప్రాజెక్టుల కింద ఆయకట్టు లక్ష్యాలను చేరుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవలే దీనిపై కాడా అధికారులతో సమీక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. లక్ష్యాలు చేరేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించించారు. కెనాల్‌లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలను ఆధునీకరించడం, సాగునీటి విడుదలను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, సంస్థాగత సామర్థ్యం పటిష్టపరచడం లక్ష్యంగా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. కాల్వల పూడికతీత పనులను ఉపాధి హామీతో అనుసంధానించడం, మధ్యప్రదేశ్‌లో అవలంబిస్తున్న మాదిరి టెయిల్ ఎండ్ నుంచి నీళ్లు ఇచ్చే విధానాన్ని జిల్లాకో చోట పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు.
ఏడు ప్రధాన ప్రాజెక్టుల కింద లక్ష్యం, గడిచిన నాలుగేళ్లలో సాగు ఇలా.. (ఎకరాల్లో)
ప్రాజెక్టు నిర్ణీత ఆయకట్టు 2012-13 2013-14 2014-15 2015-16
నాగార్జునసాగర్ 6,40,814 0 5,38,711 5,22,014 0
ఎస్సారెస్పీ 9,68,640 5,00,000 8,00,000 10,835 0
నిజాంసాగర్ 2,31,339 1,60,000 1,97,592 1,47,044 0
జూరాల 1,04,741 69,896 80,083 68,084 9,331
ఆర్డీఎస్ 87,500 23,620 23,264 23,344 19,263
కడెం 68,150 55,000 38,229 18,818 42,883
మూసీ 31,540 23,000 21,000 0 0
మొత్తం 21,32,724 8,31,516 16,98,879 7,90,139 71,477
2012-13కు ముందు సాగువిస్తీర్ణం ఇలా..(ఎకరాల్లో..)
ఏడాది సాగైంది
2008-09 15,73,331
2009-10 7,44,456
2010-11 16,36,447
2011-12 13,23,074