సర్కార్ దసరా నేడే
కొలువుదీరనున్న 21 కొత్త జిల్లాలు
కొత్తగా 25 డివిజన్లు, 125 మండలాలు
► ఉదయం 11.13కు ముహూర్తం
► జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ పరేడ్
► కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారుల బాధ్యతల స్వీకరణ
► అనంతరం బహిరంగ సభల నిర్వహణ
► సిద్ధిపేట మినహా మిగతా జిల్లాలను ప్రారంభించనున్న
మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్
► సోమవారం అర్ధరాత్రి దాటాక తుది నోటిఫికేషన్
► కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
► ఆఖరి రోజునా మండలాలు, డివిజన్ల మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సరికొత్త పరిపాలనా ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. మొత్తం 31 జిల్లాలతో తెలంగాణ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. పాలనను ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో చేపట్టిన కొత్త జిల్లాలు విజయదశమి రోజున సాకారమవుతున్నాయి. ప్రస్తుతమున్న 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి.. అదనంగా 21 కొత్త జిల్లాలు, 25 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటాక తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కేబినెట్ భేటీ నిర్వహించకుండానే మంత్రులందరికీ ఫైల్‌ను పంపి సంతకాలు తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను తలపించేలా మంగళవారం ఉదయాన్నే కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించిన ముహూర్తం మేరకు ఉదయం 11.13 గంటలకు అన్ని కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి.
సిద్దిపేట జిల్లా ప్రారంభ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మిగతా జిల్లాల ప్రారంభోత్సవ బాధ్యతలను స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి అప్పగించారు. ఇదే సమయంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభిస్తారు. కొత్త జిల్లా కేంద్రాలన్నిటా పోలీస్ పరేడ్‌తో పాటు జాతీయ పతాకావిష్కరణ, అనంతరం కలెక్టరేట్ల ప్రారంభం, కలెక్టర్, ఎస్పీల బాధ్యతల స్వీకరణ జరుగుతుంది. అనంతరం బహిరంగ సభలు నిర్వహించేందుకు రాత్రికి రాత్రి ఏర్పాట్లు జరిగాయి. కొత్త జిల్లా కేంద్రాలన్నిటా కలెక్టరేట్, ఎస్పీ, జేసీ ఆఫీసులతో పాటు ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నీ కొలువుదీరేలా భవనాలను సిద్ధం చేశారు.
కలెక్టర్లు, ఎస్పీల నియాకం
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా కసరత్తు చేసి ఈ ఫైలుపై సంతకం చేశారు. అనంతరం కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారందరూ మంత్రులతో పాటు కొత్త జిల్లాల ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. ఆ వెంటనే బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త జిల్లాలకు నియమితులైన ఎస్పీలు, జేసీలకు సైతం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
అర్ధరాత్రి వరకు కసరత్తు
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటితో పాటు కలెక్టర్లు, ఎస్పీల నియామకాలు, ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులన్నీ వరుసగా వెలువడ్డాయి. మొత్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఆగస్టు 22న ప్రకటించిన ముసాయిదాకు ప్రభుత్వం భారీగా మార్పులు చేర్పులు చేసింది. ముసాయిదాలో 27 జిల్లాలను ప్రతిపాదించగా.. చివరికి 31 జిల్లాలతో గెజిట్ రూపొందింది. సోమవారం సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా కొత్త మండలాలపై మార్పులు చేర్పులు చేయడం గమనార్హం. మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలసి విజ్ఞప్తి చేయడంతో... నల్లగొండ జిల్లాలోని మోటకొండూరు, అడవిదేవులపల్లిలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని దామెరను కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకూ ఓకే చెప్పారు. ఈ మేరకు తుది ముసాయిదాలో ఈ మూడు మండలాల పేర్లు చేర్చాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో ప్రతిపాదించిన గట్టుప్పల్‌ను కొత్త మండలాల జాబితా నుంచి తొలగించారు.
గెజిట్‌లో ఉన్న కొత్త జిల్లాలు (మండలాలు)
ఆదిలాబాద్ (18), మంచిర్యాల (18), నిర్మల్ (19), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (15), కరీంనగర్ (16), జగిత్యాల (18), పెద్దపల్లి (14), రాజన్న సిరిసిల్ల (13), నిజామాబాద్ (27), కామారెడ్డి (22), వరంగల్ అర్బన్ (11), వరంగల్ రూరల్ (15), జయశంకర్ భూపాలపల్లి (20), జనగాం (13), మహబూబాబాద్ (16), ఖమ్మం(21), భద్రాద్రి కొత్తగూడెం (23), మెదక్ (20), సంగారెడ్డి (26), సిద్దిపేట (22), మహబూబ్‌నగర్ (26), వనపర్తి (14), నాగర్‌కర్నూల్ (20), జోగులాంబ గద్వాల(12), నల్లగొండ (31), సూర్యాపేట (23), యాదాద్రి (16), వికారాబాద్ (18), మేడ్చల్ మల్కాజ్‌గిరి (14), రంగారెడ్డి (27), హైదరాబాద్ (16).