కొత్త జిల్లాలు.. కోటి ఆశలు! | new district special story | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలు.. కోటి ఆశలు!

Published Tue, Oct 11 2016 4:42 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

కొత్త జిల్లాలు.. కోటి ఆశలు! - Sakshi

కొత్త జిల్లాలు.. కోటి ఆశలు!

కొత్త జిల్లాలతో మారుతున్న అవసరాలు, ప్రాధాన్యాలు
యాదాద్రి–భద్రాద్రి మధ్య నాలుగు వరుసల హైవేతో పర్యాటకానికి ఊతం
ఆర్‌సీపురం నుంచి జహీరాబాద్‌ మీదుగా బీదర్‌ వరకు రైల్వేలైన్‌ అవసరం
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం
గిరిజన ప్రాంత జిల్లాల్లో పర్యాటకం, అటవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం
సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో చేనేత అభివృద్ధికి తోడ్పాటు

కరువుదీరా కురిసిన వానలు.. ‘కాకతీయ’ మెరుగులతో కళకళలాడుతున్న చెరువులు.. అందివచ్చిన అవకాశంతో ఈ సారి బతుకమ్మ సందడి బ్రహ్మాండం గా కనబడింది. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అస్తిత్వ ప్రకటన చేస్తున్న చందంగా దేశదేశాలలో ఉయ్యాల పాట ఊరేగింది. నేటి దసరా పండుగతో తెలంగాణ బ్రహ్మోత్సవాలకు ముగింపు. ఈ ముగింపు రోజే తెలంగాణ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి ప్రారంభదినం కావడం ఈ దసరా విశేషం. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ నేటి నుంచి 31 జిల్లాలున్న రాష్ట్రంగా మారబోతున్నది. ఈ సంఖ్యపై ఎన్ని భేదాభిప్రాయాలున్నా స్థూలంగా జిల్లాల పెంపు ప్రతిపాదనను ఎవరూ వ్యతిరేకించడం లేదు.

ప్రభుత్వ పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావడాన్ని ప్రజాస్వా మ్య వ్యవస్థ పరిణతిగానే చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పర్యవేక్షించేది మన వ్యవస్థలో జిల్లా యంత్రాంగమే. జనాభా ఎంత తక్కువగా ఉంటే అధికార యంత్రాంగం పనితీరు అంత సమర్థవంతం గా ఉంటుందని ప్రభుత్వం చేస్తున్న వాదనతో పెద్దగా పేచీ ఏమీ లేదు. కొన్ని జిల్లాల జనాభా 15 నుంచి 16 లక్షలుగా ఉండగా.. కొన్నింటిలో జనాభా ఐదారు లక్షలు మాత్రమే ఉండడం ఏవిధంగా సమర్థనీయమో ప్రభుత్వం చెప్పడం లేదు.

(హైదరాబాద్ జిల్లాలో 40 లక్షలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 27 లక్షల చొప్పున జనాభా ఉన్నప్పటికీ.. ఇవి అర్బన్ ప్రాంతాలు కావడం వల్ల, రెవెన్యూపరమైన పాలనా వ్యవహారాలు తక్కువ.) ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుని పరిపుష్టమవుతున్న కొద్దీ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు మరింత చేరువకావాల్సిన అవసరం ఉంది. అలా చేరువైన దేశాలు బాగా అభివృద్ధి చెందిన ఉదాహరణలు కూడా మనకు ఉన్నాయి. స్వల్పమైన మార్పులు మినహా ఇప్పుడున్న మన జిల్లాలు నైజాం కాలం నుంచి ఇలానే కొనసాగుతున్నాయి. వీటి జనాభా మాత్రం మూడింతలు, నాలుగింతలైంది. అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేయవలసిన జనాభా పెరుగుతున్న మేరకు ప్రభుత్వ పాలన ప్రజల నుంచి దూరం జరుగుతున్నదని అర్థం.

ఉదాహరణకు నల్లగొండ జిల్లాను తీసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి జనాభా లెక్కల సేకరణ 1961లో జరిగింది. అప్పుడు నల్లగొండ జిల్లా జనాభా 15,74,946. ఇప్పుడు ఆ జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయిన తర్వాత కూడా మిగిలిన నల్లగొండ జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 16,31,399. అంటే 1960వ దశకంలో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉన్న జనాభా కంటే విడిపోయిన తర్వాత నల్లగొండ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఒక లక్ష మంది ఎక్కువే ఉంటారు. ప్రాదేశిక విభజనను ప్రాతిపదికగా తీసుకుని చిన్న, పెద్ద జిల్లాలుగా వ్యాఖ్యానించడం సరైనది కాదు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని కదా అర్థం.

నేటి ఉదయం సీఎం సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన క్షణం నుంచి ఈ తెలంగాణ కాకతి ఏకాత్రింశతిగా మారుతుంది. ఈ 31 జిల్లాల అభివృద్ధి క్రమంలో ఏకరూపత లేదు. కొన్ని మెరుగ్గా ఉన్నా ఎక్కువ జిల్లాలు వెనుకబడిన వర్గీకరణలోనే ఉంటాయి. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తక్షణమే రచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాకు  ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఆయా జిల్లాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రాచుర్యం కల్పించాలి. అన్ని జిల్లాల్లో ఉన్నత విద్య లభించాలి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావాలి. రహదారుల నెట్‌వర్క్ పెరిగి మారుమూల ప్రాంతాలు రాజధాని నగరం, ఇతర పట్టణాలతో అనుసంధానం కావాలి. అన్ని జిల్లాల్లోని వనరులను గుర్తించి ఆకాంక్షలను గౌరవించినప్పుడే వికేంద్రీకరణకు సార్థకత చేకూరుతుంది.

ఎన్నో ఆకాంక్షల మధ్య..
వచ్చే సంవత్సరం రామానుజాచార్యుల వారి సహస్రాబ్ధి. 216 అడుగుల ఎత్తుతో ఆయన విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. తెలంగాణకు తూర్పు, పడమర దిశల్లో రెండు ప్రసిద్ధ వైష్ణవ కేంద్రాలు భద్రాద్రి, యాదాద్రి ఉన్నాయి. ఈ రెండు క్షేత్రాలను కలుపుతూ నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి ఊతం లభించడంతోపాటు మారుమూల ప్రాంతాల పురోగతికి ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి భద్రాద్రి వెళ్లే యాత్రికులు పెరుగుతారు. కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఏపీలోని గోదావరి జిల్లాల నుంచి యాదాద్రికి యాత్రీకుల సంఖ్య పెరుగుతుంది. ఈ రహదారికి చేరువలో కొలనుపాక జైన మందిరం, ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, కురవి శైవ క్షేత్రం ఉంటాయి. ఇవన్నీ ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చెందుతాయి.

కొత్తగా ఏర్పాటవుతున్న సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాలు. జహీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటవనుంది. ఆర్‌సీ పురం నుంచి జహీరాబాద్ మీదుగా బీదర్ వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి.

సిద్ధిపేట జిల్లాకు విత్తన హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇక్కడి నేలలో నాణ్యమైన విత్తనాలు పండుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులను, హార్టికల్చర్, పాలిహౌజ్, గ్రీన్‌హౌజ్‌లను ప్రోత్సహించాలి.

వ్యవసాయాభివృద్ధికి విస్తృత అవకాశాలున్న జగిత్యాల జిల్లాలో ఆ రంగానికి ప్రోత్సాహమిచ్చే చర్యలు చేపట్టాలి. ఇక్కడి పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరిన్ని పరిశోధనలు జరిగేందుకు అవకాశం కల్పించాలి. ధర్మపురి నరసింహస్వామి, కొండగట్టు అంజన్న ఆలయాలను అభివృద్ధి చేసి పర్యాటకానికి ఊతమివ్వాలి.

పెద్దపల్లి జిల్లాకు పారిశ్రామిక ప్రాంతంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే ఉన్న రైల్వే కనెక్టివిటీని మరింత విస్తృతం చేసి, కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. బసంత్‌నగర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలి.

చేనేత రంగంలో ఎంతో అభివృద్ధికి అవకాశాలున్న సిరిసిల్ల (రాజన్న) జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నామమాత్రంగా మారిపోయిన టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రోత్సహకాలు, రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి లభిస్తుంది. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.

వ్యవసాయపరంగా మంచి అభివృద్ధికి అవకాశమున్న జిల్లా వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా. ఇక్కడి రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను మరింతగా అభివృద్ధి చేస్తే... వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఈ జిల్లాలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కుతో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

భూపాలపల్లి జిల్లాకు పర్యాటక పరంగా అభివృద్ధికి అవకాశాలెక్కువ. కాళేశ్వరం, రామప్ప, మల్లూరు, మేడారం, లక్నవరం, బొగత జలపాతం, ఏటూరునాగారం అడవులు, ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అటవీ ఉత్పత్తులకు ప్రొత్సాహం కల్పించాలి.

గిరిజనులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి అవకాశాలెక్కువ. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఆసిఫాబాద్ (కొమురం భీం) జిల్లాలో ఎక్కువభాగం అటవీ ప్రాంతమే ఉంది. ఇక్కడ పర్యాటకానికి, అటవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించాలి.

కొత్తగా ఏర్పాటయ్యే నిర్మల్ జిల్లాలో పసుపు, మిర్చి, సోయా వంటి వాణిజ్య పంటలను ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలను నెలకొల్పితే ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది.

పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల జిల్లాకు సింగరేణి గనులు, సిమెంట్ పరిశ్రమలు, సిరామిక్ పరిశ్రమలు తలమానికంగా ఉన్నాయి. సరైన ప్రోత్సాహం లభిస్తే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది.

తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర, ఉండ్రుగొండ, మేళ్లచెరువు, మఠంపల్లి, ఫణిగిరి వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్న సూర్యాపేట జిల్లాలో రైల్వే మార్గం ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.

యాదాద్రి జిల్లాకు ప్రధాన బలం యాదగిరిగుట్ట దేవస్థానం. దీనితోపాటు పారిశ్రామికంగా కూడా ఇక్కడ ఎంతో అభివృద్ధికి అవకాశాలున్నాయి.

భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లాలో పర్యాటకానికి మంచి అవకాశాలున్నాయి. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

హైదరాబాద్‌కు సమీపంలో జాతీయ రహదారిపై ఉండడం కామారెడ్డి జిల్లాకు కలసి వచ్చే అంశం. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలెక్కువ.

నల్లమల అడవులు విస్తరించి ఉన్న నాగర్ కర్నూ ల్ జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది.

వికారాబాద్ జిల్లాలో నాపరాతి పరిశ్రమకు ప్రోత్సాహమివ్వాలి. హైదరాబాద్ శివారు ప్రాంతాలపై ఒత్తిడి తగ్గించేందుకు వికారాబాద్ జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement