- శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు సక్సెస్
- టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగంలోకి తీసుకొస్తాం
- రెండేళ్లలో ప్రజలకు పోలీసుల పట్ల భారీగా పెరిగిన నమ్మకం
- పోలీసు అధికారులు లంచం అడిగితే సస్పెండ్ చేస్తాం
హైదరాబాద్ : రెండేళ్లలోనే యావత్ దేశంలో తెలంగాణ పోలీసింగ్ అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకున్నదని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వ్యాఖ్యానించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు విజయం సాధించారని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులకు దేశంలోనే పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
శాంతిభద్రతలు అదుపులో ఉండి ప్రశాంత వాతావరణం ఉంటేనే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధి చెందవచ్చన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసుశాఖకు ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు ప్రతీనెలా డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. పోలీసు ఎమర్జెన్సీ నెంబర్ '100'కు భారీగా కాల్స్ వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా 'షీ టీమ్స్' ఏర్పాటు చేయడంతో పాటు ఇటీవల భరోసా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసు కోసం థర్డ్‌పార్టీ చేత విచారణ జరుపుతున్నామన్నట్లు డీజీపీ తెలిపారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్, ఠాణాలలో ప్రజలతో పోలీసు సిబ్బంది వ్యవహరించే వాటిని ఎప్పటికప్పుడు థర్డ్‌పార్టీ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వివరించారు. పోలీసులెవరైనా లంచం తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ విభాగంలో ఈ-చలాన్, బాడీ కెమెరాలను తీసుకొచ్చి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు చేస్తున్న ప్రత్యేక డ్రైవ్ వల్ల పరిస్థితి మెరుగుపడిందన్నారు. కార్డెన్ సెర్చ్ ద్వారా నేరగాళ్లను, చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలు, చోరీ చేసిన వాహనాలు భారీగా వెలుగు చూస్తున్నాయన్నారు.
ఇంతకు ముందు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెళ్లేవారు కాదని కార్డన్ సెర్చ్ ద్వారా అన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకు వెళుతున్నారన్నారు. అదే విధంగా సీఐడీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ విజయాలను డీజీపీ వివరించారు. అలాగే ఇటీవల స్టడీ టూర్‌లో భాగంగా యూఎస్‌ఏ, యూకేలలో పోలీసు ఉన్నతాధికారుల పర్యటన విషయాలను వివరించారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు పూర్ణచందర్‌రావు, గోపికృష్ణ, కృష్ణప్రసాద్ తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
'దేశంలోనే తెలంగాణ పోలీసుకు అత్యుత్తమ గుర్తింపు'
Published Tue, May 31 2016 8:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement
Advertisement