
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని తెలంగాణ పోలీస్ శాఖ శుక్రవారం ఉదయం గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, పోలీస్ అధికారులు ...పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అవార్డులు అందించారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ పోలీసుల సేవల చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు శాఖలో అనేక మార్పులు తెచ్చామన్నారు. ఎండనకా..వాన అనకా పనిచేసేది పోలీసులేనని అన్నారు. ఈ ఏడాది 470మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ ఏడాది విధినిర్వహణలో అమరులైన హోంగార్డులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ అనురాగ శర్మ తెలిపారు.