సంక్షేమాన్ని ఫ్రీజ్ చేసి పండుగా?
టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ నిధులపై ఫ్రీజింగ్ విధించి, కేటాయింపులు అమలు చేయలేని అసమర్థ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలు సంబురాలు చేసుకోమనడం దారుణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కొత్త బట్టలు కొనడానికి డబ్బుల్లేక, పండగ వంటకాలకు దిక్కులేక ప్రజలు పస్తులుంటుంటే సీఎం సంబురాలు, సోకులకు ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వృద్ధులు, వితంతు,వికలాంగుల పెన్షన్ల బకాయిలు, ఇలా అనేక సంక్షేమపథకాల బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. డి గ్రీ,పీజీ కాలేజీల ఫీజు బకాయిల కోసం యాజమాన్యాలు సమ్మె బాట పట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఆర్థిక అసమర్థతను దాచి పెట్టి, పండగలు సంతోషంగా జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునివ్వడం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని తన ప్రకటనలో పేర్కొన్నారు.