స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) విలీన ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) విలీన ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రజల బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన ఎస్‌బీహెచ్‌ను విలీనం చేయకుండా కాపాడుకోవడం అత్యంత అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
అనుబంధ బ్యాంకులను విలీనం చేసే కీలక నిర్ణయానికి ముందు బ్యాంకు లాభ-నష్టాలు, రుణాల వసూళ్లు, బలహీనతలు, ప్రజాభిప్రాయం తదితర అంశాలపై లోతుగా చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఎలాంటి ముందస్తు నోటీసు, ఎజెండా లేకుండా ఒకే రోజు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అనేక శాఖలు మూతపడి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు.