అబ్బురపరిచేలా తెలుగు మహా సభలు
తెలంగాణ సాహితీమూర్తుల ప్రతిభ ప్రధానాంశంగా సభలు
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
- సాహితీవేత్తలందరినీ ఆహ్వానించి గౌరవించాలి
- రాష్ట్రావతరణ రోజున మహాసభలకు అంకురార్పణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన వారిని, వివిధ రకాల సాహితీ ప్రక్రియల్లో విశేష పాత్ర పోషించిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలుగు మహాసభల అంకురార్పణ జరపాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులు, తెలుగు పండితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్నారు. ప్రారంభ సభకు హాజరయ్యే పండితులకు ఆన్ డ్యూటీ అవకాశం ఇవ్వడంతోపాటు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పారు. అంకురార్పణ సభ తర్వాత వారం, పది రోజులపాటు సభలను నిర్వహించాలని, మహా సభల్లో వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు.
వారందరినీ స్మరించుకోవాలి...
‘‘తెలుగు భాషాభివృద్ధి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లో విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. పోతన నుంచి మొదలుకుంటే ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు చేసిన వారున్నారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారున్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం, అవధానం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సభలు నిర్వహించాలి. సినీ, పాత్రికేయ, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరి కథ, బుర్ర కథ, యక్షగానం తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానాంశాలుగా తెలుగు మహాసభలు జరగాలి...’’అని సీఎం దిశానిర్దేశం చేశారు.
పగలు సదస్సులు... రాత్రి కళారూపాలు
మహాసభల్లో పగటిపూట సదస్సులు, రాత్రిళ్లు పేరిణి నృత్య ప్రదర్శన సహా వివిధ కళారూపాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. అలాగే కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్‌తోపాటు ముంబై, సూరత్, భివండి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, షోలాపూర్, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని సభలకు ఆహ్వానించాలని సీఎం సూచించారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, గల్ఫ్ తదితర దేశాల్లో తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలను మహాసభల్లో భాగస్వాములను చేయాలన్నారు. తెలంగాణ సాంçస్కృతిక శాఖ సమన్వయంతో ఈ సభలు జరుగుతాయని చెప్పారు.